టిక్కెట్ లేకుండా విమానంలో ప్రయాణించిన రష్యన్..
విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్ట్, వీసా వంటివి ఉండాల్సిందే. వాటితో పాటు టిక్కెట్ కూడా ఉండాలి. కానీ, రష్యన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం టిక్కెట్ లేకుండా విమానంలో ప్రయాణించాడు. అంతేకాదు ఆ వ్యక్తి దగ్గర పాస్‌పోర్ట్ కానీ, వీసా కానీ ఏవీ లేవు. అయినా అతను దేశం దాటేశాడు. విమానం దిగాక ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. ప్రయాణికులు జాబితాను పరిశీలించినా అందులో అతని పేరు లేకపోవడంతో విమానాశ్రయ సిబ్బంది షాక్ అయ్యారు. టిక్కెట్ లేకుండా విమానం ఎలా ఎక్కావని ఆయనను ప్రశ్నిస్తే.. తనకేం గుర్తులేదని సమాధానం ఇచ్చాడు. అయితే, ఈ సంఘటన గత నెలలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై అమెరికా నేర పరిశోధనా సంస్థ ఎఫ్‌బీఐ విచారణ చేస్తోంది.
ఆ ప్రయాణికుడి పేరు సెర్గెయ్ వ్లాదిమిరోవిచ్ ఒచిగవా. ఈయన రష్యాకు చెందినవారు. కానీ, ప్రస్తుతం అతను ఇజ్రాయెల్‌లో స్థిరపడ్డాడు. ఒచిగవా నవంబర్ 4న డెన్మర్క్‌లోని కోపెన్ హాగెన్ ఎయిర్ పోర్టునుంచి అమెరికాకు ప్రయాణించాడు. ఈ ప్రయాణంలో కావాల్సిన ఎటవంటి డాక్యుమెంట్స్ ఆయన దగ్గర లేవు. వీసా,పాస్‌పోర్ట్, టిక్కెట్ వంటివి ఏవీ లేకుండానే ఆయన ప్రయాణించాడు. విమానంలో ఎంటర్ అయ్యేందుకు చూపించే బోర్డింగ్ పాస్ కూడా అతని దగ్గర లేదు. అయినా విమానంలో తను చేరుకోవాల్సిన గమ్యాన్ని అలవోకగా చేరుకుని ఎయిర్‌పోర్ట్ సిబ్బందిని షాక్‌కు గురిచేశాడు.

ప్రయాణికుడిపై విచారణ చేపట్టిన ఎఫ్‌బిఐ : అయితే, లాస్ ఏంజిలిస్‌లో విమానం దిగినా ఒచిగవాను చూసి అక్కడి సిబ్బందికి ఏమీ అర్థం కాలేదు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా ఈయన విమానంలో ఎలా ప్రయాణించాడా? అని ఎయిర్‌పోర్ట్ అధికారులు, సిబ్బంది ఆలోచిస్తున్నారు. రెండు మూడు రోజుల విమాన జాబితాలను కూడా పరిశీలించగా, అతని పేరు ఎక్కడ కనిపించలేదు. దీంతో ఇలా ఎలా ప్రయాణించారని అధికారులు ఒచిగవాను ప్రశ్నించారు. దాంతో అతను తనకు మూడు రోజులుగా నిద్రలేదని, అసలు విమానం ఎలా ఎక్కానో కూడా తనకు గుర్తులేదని చెప్పాడు. ప్రయాణం మధ్యలో ఒచిగవా పలుమార్లు సీట్లు మారాడని, భోజనం కోసం ఒకటికి రెండుసార్లు రిక్వెస్ట్ చేశాడని ఫ్లైట్ అటెండెంట్స్ తెలిపారు. ఒచిగవా కాస్త అశాంతిగా కనిపించాడని ఈ విచారణలో వెల్లడించారు. అయితే, ఈ సంఘటనపై అమెరికా నేర పరిశోధనా సంస్థ ఎఫ్‌బిఐ విచారణ చేస్తోంది.












Click it and Unblock the Notifications