సౌదీ బస్సు ప్రమాదం: ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క వ్యక్తి ఇతనే!
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ భయంకరమైన ప్రమాదం నుంచి కేవలం ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలతో ఒకే ఒక్క వ్యక్తి బయటపడ్డాడు. ఆ వ్యక్తి పేరు మహ్మద్ అబ్దుల్ షోయబ్(24) కాగా.. ఇతను హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ప్రమాదం సమయంలో షోయబ్ బస్సు డ్రైవర్ సమీపంలో కూర్చున్నందున ప్రమాదం నుంచి బయటపడగలిగాడు. అయితే షోయబ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఈ ప్రమాదంలో షోయబ్ తన కుటుంబ సభ్యులలో చాలా మందిని కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఈ ఘోర బస్సు ప్రమాదం సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో.. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న మార్గంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 46 మంది యాత్రికులు ఉన్నట్లు భావిస్తున్నారు. మరణించిన 42 మంది భారతీయ యాత్రికులలో అత్యధిక మంది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చెందినవారేనని ప్రాథమిక సమాచారం ప్రకారం తెలిసింది.

కేంద్ర విదేశాంగ శాఖ, తెలంగాణ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం
ఈ ఘటనపై రష్యా పర్యటనలో ఉన్న కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ ఈ ప్రమాదంలో ప్రభావితమైన భారతీయ పౌరులకు, కుటుంబాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారనే ప్రాథమిక సమాచారంతో, తక్షణమే పూర్తి వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), డీజీపీని ఆదేశించారు.
సహాయక చర్యలు
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు, సహాయక చర్యల కోసం సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. మృతుల కుటుంబాలకు సమాచారం అందించడానికి, సహాయ సహకారాలు అందించడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), సౌదీ రాయబార కార్యాలయంతో సంప్రదించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జెడ్డాలోని భారత మిషన్ కూడా సహాయక చర్యలను సమన్వయం చేయడానికి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications