అమ్మాయితో సెల్ఫీ దిగి దొరికిపోయిన దొంగ
న్యూయార్క్: ఓ దొంగ దొంగతనం చేశాడు. ఆ తర్వాత దొంగతనం చేసిన ఇంట్లోని ఓ అమ్మాయితో సెల్ఫీ ఫొటో కూడా దిగాడు. అంతటితో ఆగకుండా ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముందు పసిగట్టిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. విక్టర్ అల్మాంజా మార్టినెజ్ అనే 18ఏళ్ల యువకుడిని దోపిడీ నేరం మీద పోలీసులు అరెస్టు చేశారు. ఈ దోపిడీలో అతడితో పాటు పాల్గొన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. విక్టర్, అతడి ఇద్దరు స్నేహితులు కలిసి కాలిఫోర్నియాలోని లోవర్ పార్క్ ప్రాంతంలో ఓ ఇంటికి వెళ్లారు.

అక్కడివాళ్లను తుపాకులతో బెదిరించి, వాళ్ల కారుతో సహా విలువైన వస్తువులు దోచుకుపోయారు. అంతేగాక, బాధితుల కుటుంబంలో ఉన్న ఓ అమ్మాయితో విక్టర్ స్నాప్‌చాట్ సెల్ఫీ తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ సెల్ఫీని ఆమెకు కూడా పంపించాడు.
కాగా, ఆ సెల్ఫీ ఆధారంగా విక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. సాయుధ దోపిడీ, కిడ్నాప్ నేరాలకు పాల్పడినందున అతడిపై సంబంధిత కేసులు నమోదు చేసి మాంటెరీ కౌంటీ జైల్లో పెట్టారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications