కాబూల్‌లో తాలిబన్ల అరాచకం... పంజ్‌షీర్‌పై గెలుపు సంబరాల్లో కాల్పులు... పలువురు మృతి...
ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా నిష్క్రమణతో తాలిబన్లు ఎంతలా సంబరాలు జరుపుకున్నారో... పంజ్‌షీర్‌ను హస్తగతం చేసుకున్నామని అంతకు రెట్టింపు సంబరాలు జరుపుకుంటున్నారు. దశాబ్దాలుగా తమకు కొరకరాని కొయ్యలా మారిన పంజ్‌షీర్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడాన్ని అతిపెద్ద విజయంగా వారు భావిస్తున్నారు. పంజ్‌షీర్‌ను ఆక్రమించుకున్నామని తాలిబన్ ఫైటర్లు ప్రకటించడంతో... శుక్రవారం ఆఫ్గనిస్తాన్ వ్యాప్తంగా తాలిబన్లు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.
కాబూల్‌లో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపి పంజ్‌షీర్‌పై విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ కాల్పుల్లో కొంతమంది చిన్నారులు సహా పలువురు వ్యక్తులు మృతి చెందినట్లు స్థానిక ఆఫ్గన్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. సోషల్ మీడియాలో వెలుగుచూసిన కొన్ని వీడియోల్లో... గాయపడిన వ్యక్తులను ఆస్పత్రికి తరలించడం కనిపిస్తోంది. కాల్పులకు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వెలుగుచూసింది.

Recommended Video
తాము పంజ్‌షీర్‌ను జయించామని... ప్రస్తుతం ఆ ప్రావిన్స్ తమ ఆధీనంలోనే ఉందని తాలిబన్లు ప్రకటించుకున్నారు. 'అల్లా దయతో ఆఫ్గనిస్తాన్ మొత్తాన్ని మా ఆధీనంలోకి తెచ్చుకున్నాం.పంజ్‌షీర్‌లో తిరుగుబాటుదారులను ఓడించాం. ప్రస్తుతం ఆ ప్రావిన్స్ మా కమాండ్‌లోనే ఉంది.' అని తాలిబన్ కమాండర్ ఒకరు వెల్లడించారు.
ఈ ప్రకటనను ఆఫ్గనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఖండించారు.తాలిబన్లతో పంజ్‌షీర్ తిరుగుబాటు దళం ఇంకా యుద్ధం చేస్తోందని... పంజ్‌షీర్ తాలిబన్ ఆధీనంలోకి వెళ్లిందన్న వార్తల్లో నిజం లేదని అన్నారు.'సందేహం అక్కర్లేదు... మేమిప్పుడు చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం.తాలిబన్ల దండయాత్ర కొనసాగుతోంది.అయితే మేము ఈ నేలను పట్టుకుని పోరాడుతున్నాం.' అని వెల్లడించారు. ప్రస్తుతం తమ పోరాటం కొనసాగుతోందని... అది కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. 'నేనిప్పుడు నా దేశం కోసం నిలబడుతున్నాను... దేశ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను' అని పేర్కొన్నారు. ఈ మేరకు బీబీసీ న్యూస్‌కు ఆయన ఓ వీడియో సందేశం పంపించారు.
అమృల్లా సలేహ్ తనయుడు ఎబదుల్లా సలేహ్ కూడా తాలిబన్ల ప్రకటనను ఖండించారు. తాలిబన్లు పంజ్‌షీర్‌ను జయింలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆఫ్గనిస్తాన్ జాతీయ తిరుగుబాటు దళం-విదేశీ వ్యవహారాల చీఫ్ అలీ నజరీ సైతం తాలిబన్ల ప్రకటనను ఖండించారు. తాలిబన్లు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.తాలిబన్లు పంజ్‌షీర్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారని... ఇలాంటి తరుణంలో అందరి దృష్టిని మరల్చేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తద్వారా ఆఫ్గనిస్తాన్ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. పంజ్‌షీర్‌లోని తిరుగుబాటు దళ నాయకులతో తాను టచ్‌లో ఉన్నానని తెలిపారు.












Click it and Unblock the Notifications