ఏఐఏడీఎంకేకు బిగ్ షాక్.. !!
ప్రముఖ సినీ నటి గౌతమి తాడిమల్ల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏఐఏడీఎంకేకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి కిందటే ఆమె అధికారికంగా ప్రకటించారు. సమాజ సేవా కార్యక్రమాల్లోనే మరింత చురుగ్గా పాల్గొనేందుకు వీలుగా ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామికి పంపించారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అన్నాడీఎంకే తరఫున చురుగ్గా వ్యవహరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఓడిపోయింది. అనూహ్యంగా విజయ్ సారథ్యంలోని టీవీకే అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించిన తర్వాత రాజీనామా నిర్ణయం తీసుకున్నానని గౌతమి పేర్కొన్నారు.

అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ ప్రచార విభాగం డిప్యూటీ సెక్రటరీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు గౌతమి స్పష్టం చేశారు. తనతో పాటు కలిసి పనిచేసిన పార్టీ సీనియర్లు, మాజీ మంత్రులు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ఆమె రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బరువెక్కిన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.
గౌతమి 29 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం
దశాబ్దాల పాటు సినీ రంగంలో అగ్ర కథానాయికగా రాణించారు గౌతమి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 1997లో బీజేపీలో చేరారు. క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి అగ్రనేత ఎల్ కే అద్వానీ సమక్షంలో కండువా కప్పుకున్నారు. సుమారు పాతికేళ్లకు పైగా ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారు. బీజేవైఎం జాతీయ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు.
2023 అక్టోబర్ లో ఆమె బీజేపీ నుంచి బయటికి వచ్చారు. తన కష్టార్జితమైన రూ. 25 కోట్ల విలువైన ఆస్తులను కాజేసిన ఒక మోసగాడికి కొందరు పార్టీ సీనియర్ నాయకులే మద్దతుగా నిలిచారని, పార్టీ నాయకత్వం కూడా తనకు ఎలాంటి న్యాయం చేయలేదనే మానసిక వేదనతో ఆమె బీజేపీ నుంచి తప్పుకొన్నారు. 2024 ఫిబ్రవరి 14న అన్నాడీఎంకే కండువా కప్పుకొన్నారు. అదే ఏడాది ప్రచార విభాగం డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇప్పుడు తాజాగా అన్నాడీఎంకేకూ గుడ్ బై చెప్పారు.
దీని తర్వాత ఆమె అడుగులు ఎటు పడతాయనేది చర్చనీయాంశమౌతోంది. టీవీకేలో చేరొచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె క్యాన్సర్ వ్యాధి బాధితులలో చైతన్యం తీసుకురావడానికి, పేద విద్యార్థులకు అవసరమైన సహాయం అందించేందుకు 'లైఫ్ అగైన్ ఫౌండేషన్' పేరిట ఒక స్వచ్ఛంద సామాజిక సంస్థను నడుపుతున్నారు. కొద్దిరోజుల పాటు దీనిపై పూర్తిస్థాయిలో పని చేస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications