ఆదాయం కోసం సెక్స్ బానిసలను ఫేస్‌బుక్ ద్వారా విక్రయం
వాషింగ్టన్: మగవారు గడ్డం చేసుకుంటే 100 డాలర్ల జరిమానా. అదే మహిళలు బిగుతైన దుస్తులు ధరిస్తే 25 డాలర్ల పెనాల్టీగా విధిస్తారు. ఐసిస్ ఉగ్రవాదుల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలపై విధిస్తున్న పన్నుల భారమని ఓ రీసెర్చ్ సర్వేలో వెల్లడైంది. అమెరికా, రష్యా సైనిక దళాల వరుస దాడులతో ఈ మధ్య కాలంలో ఐసిస్ ఉద్రవాదులు ఆర్ధికంగా నష్టపోయారు.
వాళ్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాలు, చమురు క్షేత్రాలు కూడా తగ్గుముఖం పట్టడంతో ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇరాక్, సిరియాలోని ఐసిస్ పాలిత ప్రాంతాల ప్రజలపై ఆరు నెలల నుంచి పన్నులను భారీగా పెంచేశారని ఐఎచ్ఎస్ అనే సంస్ధ స్థానిక న్యూస్ రిపోర్టుల ఆధారంగా వెల్లడించింది.
పురుషులు గడ్డాన్ని పూర్తిగా తొలగిస్తే 100 డాలర్లు, ట్రిమ్మింగ్ చేస్తే 50 డాలర్ల జరిమానా చెల్లించాలనే నిబంధన విధించారు. పురుషులు సాంప్రదాయకమైన పొడవైన, వదులైన దుస్తులు ధరించకుంటే 5 డాలర్లు జరిమానా కట్టాలి. మహిళలు శరీర భాగాలు కనిపించేట్లు బిగుతైన దుస్తులు ధరిస్తే 25 డాలర్లు, కళ్లు కనబడేట్లు ధరిస్తే 10 డాలర్లు లేదా ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.

అంతేకాదు మహిళలు సాక్సులు లేదా గ్లోవ్స్ ధరించకుండా బయటికెళ్తే 30 డాలర్లు చెల్లించాలని కఠిన నిబంధనలు విధించారు. సిగరెట్ల ప్యాకెట్ పురుషుల వద్ద లభిస్తే 46 డాలర్లు, మహిళల వద్ద లభిస్తే 23 డాలర్ల జరిమానా కట్టాల్సి ఉంటుంది. చెక్ పాయింట్ల వద్ద నుంచి వెళ్లే ట్రక్కులు ఇకనుంచి 600-700 డాలర్ల పన్ను కట్టాలి.
గతంలో ఈ పన్ను 300 డాలర్లుగా ఉండేది. ఇరాక్, సిరియా ప్రభుత్వాల్లో గతంలో పనిచేసిన భద్రతా సిబ్బంది, ఉద్యోగులు ఐఎస్ ఉగ్రవాదుల నుంచి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ సర్టిఫికేట్ పొందాలంటే తగిన రుసుము చెల్లించాల్సిందే. సున్నీ తెగకు చెందని ముస్లింల నుంచి జిజియా పన్నును సైతం ఉగ్రవాదులు వసూలు చేస్తున్నారు.
అంతేకాదు.. ఐఎస్ ఉగ్రవాదులు వివిధ ప్రాంతాలపై దాడులు చేసి అపహరించిన మహిళలను, యువతులను సెక్స్ బానిసలుగా చేసుకున్నారు. ఇప్పుడు తిండి, వైద్యం ఖర్చులు భరించే పరిస్థితి లేకపోవడంతో సెక్స్ బానిసలను ఫేస్‌బుక్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇటీవల 18 ఏళ్ల ఇద్దరు యువతులను ఓ ఉగ్రవాది ఫేస్‌బుక్‌లో 8 వేల డాలర్లకు అమ్మకానికి పెట్టాడు.
ఇలాంటి విక్రయాలు ఐఎస్ ఆధీనంలోని సిరియా, ఇరాక్‌లలో భారీగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ముస్లిమేతరులు, యజీదీ మహిళలను సెక్స్ బానిసలుగా చేసుకోవడం, ఒక ఉగ్రవాది మరో ఉగ్రవాదికి విక్రయించడం నిత్యకృత్యంగా మారింది. ఒక్కో మహిళను వారి డిమాండ్‌ను బట్టి ఒక్కో ధరకు విక్రయిస్తున్నారు.
అయితే వీళ్ల ఫొటోలను ఫేస్‌బుక్ యాజమాన్యం ఎప్పటికప్పుడు తొలగించడం విశేషం. ఐసిస్ ఉగ్రవాదులు ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవడం విశేషం.












Click it and Unblock the Notifications