1945లో యాల్టా.. ఇప్పుడు షెన్‌జెన్! ప్రపంచ చరిత్ర మళ్లీ తిరగరాయబోతున్నారా?
చైనా టెక్ హబ్ షెన్‌జెన్ నగరం ఓ చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతోంది. ప్రపంచంలోని మూడు అగ్రరాజ్యాల అధినేతలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే వేదికపైకి రానున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురు అగ్రనేతలు షెన్‌జెన్ చేరుకున్నారు. గురువారం(నవంబర్ 19) జరగనున్న ఈ కీలక సమావేశంలో యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అణ్వాయుధాల నియంత్రణ వంటి అనేక సవాళ్లపై చర్చించనున్నారు.
ఈ సమావేశాన్ని అంతర్జాతీయ విశ్లేషకులు సాధారణ దౌత్య భేటీగా చూడటం లేదు. సరిగ్గా 81 ఏళ్ల క్రితం 1945లో జరిగిన చారిత్రక యాల్టా సదస్సుతో దీనిని పోలుస్తున్నారు. నాడు ప్రపంచ శక్తి సమతుల్యతను మార్చినట్లే.. నేడు షెన్‌జెన్ భేటీ కొత్త ప్రపంచ క్రమానికి బాటలు వేస్తుందా అన్న చర్చ మొదలైంది.
ప్రపంచాన్ని మార్చిన 1945 యాల్టా సదస్సు ఏంటి?
రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో ఉన్నప్పుడు 1945 ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు క్రిమియాలోని యాల్టా నగరంలో(ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉంది) మిత్రరాజ్యాల 'బిగ్ త్రీ' నేతలు సమావేశమయ్యారు. అమెరికె అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్డ్, బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, సోవియట్ యూనియన్ నేత జోసెఫ్ స్టాలిన్ ఈ భేటీలో పాల్గొన్నారు. యుద్ధం తర్వాత నాజీ జర్మనీ విభజన, యూరప్ రాజకీయ సరిహద్దులు, తూర్పు యూరప్‌లో సోవియట్ ప్రభావం, ఐక్యరాజ్యసమితి ఏర్పాటు, భద్రతా మండలిలో వీటో అధికారాలు వంటి కీలక నిర్ణయాలు అక్కడే జరిగాయి. ఆ సదస్సు తర్వాతే బ్రిటన్ ప్రాభవం తగ్గి, అమెరికా ప్రపంచ అగ్రరాజ్యంగా అవతరించింది.

షెన్‌జెన్ భేటీ ఎజెండా..ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ
నాడు యుద్ధ విజేతలు కలిస్తే.. నేడు భౌగోళిక రాజకీయాల్లో పోటీపడుతున్న అగ్రదేశాలు అమెరికా, చైనా, రష్యా ఒకే టేబుల్‌పై కూర్చోవడం గమనార్హం. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ కింది అంశాలు చర్చకు రానున్నాయి.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం: దీని ప్రభావం యూరప్ భద్రతపై ఉంది.
ఇరాన్ సంక్షోభం: పశ్చిమాసియాలో అమెరికా సైనిక చర్యలు, ప్రాంతీయ స్థిరత్వం.
అణ్వాయుధ ఒప్పందం: అమెరికా, రష్యా మధ్య చివరి అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం 'న్యూ స్టార్ట్' ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. చైనాను కూడా కలుపుకుని కొత్త ఒప్పందం చేయాలని ట్రంప్ పట్టుబడుతుండగా.. తమ వద్ద అణ్వాయుధాలు తక్కువగా ఉన్నాయంటూ చైనా విముఖత చూపుతోంది.
వాణిజ్య యుద్ధం, ఏఐ: టారిఫ్స్, సెమీకండక్టర్లు, ఏఐ చిప్స్, అరుదైన ఖనిజాలపై అమెరికా-చైనా మధ్య ఉన్న విభేదాలు.
చిన్న దేశాల ఆందోళన.. భారత్ చూపు
యాల్టా సదస్సులో పోలాండ్ వంటి దేశాల ప్రమేయం లేకుండానే వాటి భవిష్యత్తును అగ్రరాజ్యాలు నిర్ణయించాయి. ఇప్పుడు షెన్‌జెన్‌లోనూ తమ ప్రమేయం లేకుండా ఏవైనా ఒప్పందాలు జరుగుతాయేమోనని ఉక్రెయిన్ వంటి దేశాలు ఆందోళన చెందుతున్నాయి. పుతిన్‌ను సంతృప్తి పరిచే బదులు యుద్ధం ఆపేలా ట్రంప్, జిన్‌పింగ్ ఒత్తిడి తేవాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా కోరారు. మరోవైపు పశ్చిమాసియా, వాణిజ్య అంశాలపై ఈ ముగ్గురు నేతలు తీసుకునే నిర్ణయాలు భారత్ సహా ప్రపంచ దేశాలపై ప్రభావం చూపనున్నాయి.
యాల్టా-2 అనడం తొందరపాటేనా?
పశ్చిమ దేశాల ఆంక్షలు పాత ఆయుధాలను, చర్చల ద్వారానే విభేదాలు పరిష్కారమవుతాయని వ్లాదిమిర్ పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ భేటీని యాల్టా సదస్సులో పోల్చడం విశ్లేషకుల ఊహ మాత్రమేనని రష్యా కొట్టిపారేసింది. మధ్యంతర ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ట్రంప్.. చైనాకు ఎలాంటి రాయితీలు ఇచ్చే మూడ్‌లో లేరని, కాబట్టి ఈ భేటీ నుంచి భారీ ఒప్పందాలు ఆశించలేమని నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా మూడు అగ్రరాజ్యాలు ఒకే చోట చేరినప్పుడు అవి ఘర్షణలను తగ్గిస్తాయా లేదా ప్రపంచాన్ని కొత్త అధికార పోరులోకి నెడతాయా అనేది ఆసక్తికరంగా మారింది.














Click it and Unblock the Notifications
