భారత టెక్కీలకు షాక్: చట్టరూపం దాల్చనున్న హెచ్1బి వీసా బిల్లు!
హెచ్1బి వీసా ప్రోగ్రాంలో మార్పులు చేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా కాంగ్రెస్ లో మళ్ళీ ప్రవేశపెట్టారు.
న్యూయార్క్: హెచ్1బి వీసా ప్రోగ్రాంలో మార్పులు చేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా కాంగ్రెస్ లో మళ్ళీ ప్రవేశపెట్టారు. వివిధ దేశాలకు చెందిన నిపుణులైన ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వీలు కల్ఫించే పలు మార్పులు ఇందులో చేశారు. అమెరికా భావి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యాల్లో ఇమ్మిగ్రేషన్ చట్టాలను పునర్వ్యవస్థీకరించడం అనేది కీలకమైన అంశంగా ఉన్న సంగతి తెలిసిందే.
హెచ్1బి వీసా ఉన్న వారికి కనీస వార్షిక వేతనం లక్ష డాలర్లు ఉండాలన్నది, మాస్టర్ డిగ్రీ మినహాయింపు తొలగించడం.. ఈ బిల్లులో ప్రధాన మార్పులుగా పరిగణించవచ్చు. తద్వారా వీసా దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని, నిజమైన ప్రతిభావంతులకే ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని బిల్లును ప్రవేశపెట్టిన సభ్యులు పేర్కొంటున్నారు.

డిస్నీ తదితర కంపెనీలు ఈ వీసా ప్రోగ్రాంను దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ కొత్త బిల్లు తెరమీదికి వచ్చింది. అమెరికా ఎప్పటిలా అగ్రస్థానంలో ఉండాలంటే ప్రపంచంలోని ప్రతిభావంతులను, నిపుణులను అట్టి పెట్టుకోవాలని వారు చెబుతున్నారు.
అదేసమయంలో కంపెనీలు అవుట్ సోర్సింగ్ పేరుతో అమెరికన్ ఉద్యోగుల స్థానాల్లో తక్కువ జీతాలకు విదేశీయులను నియమించుకుంటూ వీసా ప్రోగ్రాంలను దుర్వినియోగం చేయకుండా చూడాలని బిల్లు ప్రవేసపెట్టిన సభ్యులు పేర్కొన్నారు.
తాము ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఈ రెండు ప్రయోజనాలనూ నెరవేరుస్తుందని, హెచ్1బి వ్యవస్థ దుర్వినియోగాన్ని అరికడితే అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత చేకూరుతుందని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications