ఏదో ఒకటి చేయ్.. ఇలా చనిపోకూడదు: ఫ్లై దుబాయ్ ఘటనలో సంచలన విషయాలు వెల్లడించిన పైలట్ స్మిత్ మచ్చర్
ఫ్లై దుబాయ్ విమాన ఘటన భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో-పైలట్ ప్రయత్నం చేయగా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ అడ్డకున్నారు. ఈ ఘటనలో మచ్ఛర్ తన ప్రాణాలకు తెగించి మరీ 180 మందికిపైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మచ్చర్ ప్రస్తుతం అబుదాబిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆయన ఆరోగ్యం మెల్లమెల్లగా కుదుటపడుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పైలట్ స్మిత్ మచ్చర్ ఆ రోజు జరిగిన విమాన ప్రమాదంపై మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ భయానక క్షణాలకు మరోసారి గుర్తుచేసుకున్నారు. స్కై న్యూస్ అరేబియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. చనిపోబోతున్నానని మీరు అనుకున్నారా..? అన్న ప్రశ్నకు అవును అని సమాధానం ఇచ్చారు. ఒకానొక సమయంలో తాను చనిపోతున్నానని అర్థం అయిందని.. కానీ స్మిత్.. ఏదైనా ఒకటి చెయ్.. ఇలా చనిపోవడం కరెక్ట్ కాదు.. అని తనను తాను మోటివేట్ చేసుకున్నట్లు స్మిత్ మచ్చర్ వివరించారు. నేను నా మరణాన్ని యాక్సెప్ట్ చేశానని చెప్పడం లేదు.. కానీ చనిపోతానని అనుకున్నప్పుడు ఏదైనా చేయాలి.. ఇలా చావకూడదు అని అనుకున్నానని పేర్కొన్నారు.

అలాగే విమాన ప్రయాణ సమయంలో తోటి పైలట్ బలంగా తలపై కొట్టిన దెబ్బకు కొద్ది క్షణాలపాటు తనకు మైండ్ పనిచేయలేదని.. స్పృహ కోల్పోయానా..? అన్న అనుమానం కలిగిందని గుర్తుచేశారు. అలాగే డోర్ ఓపెన్ చేయగానే ప్రయాణికుల ఆర్తనాదాలు కూడా వినిపించాయని తెలిపారు. తన ఇద్దరు కో పైలట్స్ ఒకరు ప్రేయర్ చేస్తున్నారని.. మరొకరు విమానాన్ని నడిపే బాధ్యతల్ని తీసుకున్నట్లు స్మిత్ మచ్చర్ స్పష్టం చేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని నడిపే బాధ్యతల్ని తీసుకుని ప్రయాణికులను కాపాడిన ఆ పైలట్ ను తన చివరి శ్వాస వరకూ గుర్తుపెట్టుకుంటానని తెలిపారు.
"أدركت للحظة أنني لن أنجو".. قائد طائرة فلاي دبي يروي لأول مرة حصرياً لسكاي نيوز عربية لحظات مؤثرة عاشها عقب الاعتداء عليه المقابلة كاملة:21:00 بتوقيت أبوظبي 17:00 بتوقيت غرينتشملاحظة: تعكس التصريحات الواردة في هذه المقابلة ما يتذكره الضيف من أحداث، وفقا لتجربته الشخصية وإدراكه لها وقت وقوعها.
— سكاي نيوز عربية (@skynewsarabia) October 17, 2026
ఇక ప్రస్తుతం పైలట్ స్మిత్ మచ్చర్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు ఈ ఉగ్రదాడి నుంచి 174 మందిని కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ను ఇజ్రాయెల్ అత్యున్నత పౌర సాహస పురస్కారంతో సత్కరించనున్నట్లు ఇటీవల తెలిపింది. ఈ మేరకు ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం అవార్డుకు ఆయన్ను ఎంపిక చేసింది. ప్రస్తుతం స్మిత్ మచ్చర్ చికిత్స పొందుతుండగా ఆయన కోలుకోగానే అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం పేర్కొంది.












Click it and Unblock the Notifications
