ఎలన్ మస్క్ అసలు రంగు ఇదేనా? ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న డాక్యుమెంటరీ!
ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ జీవితం, ఆయన వ్యాపార సామ్రాజ్యం, అనూహ్య రాజకీయ పరిణామాల ఆధారంగా రూపొందించిన 'మస్క్(musk)' డాక్యుమెంటరీ ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ పరిశోధనాత్మక డైరెక్టర్ అలెక్స్ గిబ్నీ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ.. ప్రతిషాత్మక వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా పెద్ద ఎత్తున వివాదాలకు కూడా కేంద్రబిందువుగా మారింది.
దాదాపు 3 గంటల 52 నిమిషాల సుదీర్ఘ నిడివితో రెండు విభాగాలుగా ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. మొదటి భాగంలో టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ వంటి ప్రముఖ సంస్థల స్థాపన, వాటి ద్వారా ఎలన్ మస్క్ నిర్మించిన అపార వ్యాపార సామ్రాజ్యాన్ని లోతుగా విశ్లేషించారు. ఇక రెండో భాగంలో ఆయన తీవ్రమైన రాజకీయ పరిణామం, ముఖ్యంగా 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడం, తదనంతరం ప్రభుత్వ సామర్థ్య శాఖ 'డోజ్' నిర్వహణలో ఆయన భాగస్వామ్యం కావడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.

ఈ డాక్యుమెంటరీ నిర్మాణంలో పాల్గొనడానికి లేదా ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎలన్ మస్క్ స్పష్టంగా నిరాకరించారు. అంతేకాకుండా డైరెక్టర్ తనను సంప్రదించడానికి ముందే సోషల్ మీడియా వేదికగా ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో డైరెక్టర్ అలెక్స్ గిబ్నీ ఓ వినూత్న సాంకేతిక మార్గాన్ని ఎంచుకున్నారు. గతంలో వివిధ వేదికలపై ఎలన్ మస్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలు, మాట్లాడిన మాటల ఆధారంగా ఆయనలా కనిపించే సీజీఐ/ఏఐ డిజిటల్ అవతార్‌ను రూపకల్పన చేసి డాక్యుమెంటరీలో సమర్థవంతంగా ఉపయోగించారు.
ఈ డాక్యుమెంటరీలో ఎలన్ మస్క్ అంతరంగం, వ్యక్తిగత జీవితాన్ని ఆవిష్కరించేందుకు ఆయన తండ్రి ఎర్రోల్ మస్క్, మొదటి భార్య జస్టిన్ మస్క్, ప్రముఖ టెక్ జర్నలిస్ట్ కారా స్విషర్, ఏఐ రంగానికి చెందిన జాఫ్రీ హింటన్, టెస్లా సహ వ్యవస్థాపకుడు మార్టిన్ ఎబర్‌హార్డ్, రచయిత్రి జో షిఫర్ల ఇంటర్వ్యూలను పొందుపరిచారు. ఇవన్నీ మస్క్ నడివడికపై కీలక విషయాలను వెలుగులోకి తెచ్చాయి.
అయితే ఈ డాక్యుమెంటరీ విడుదల కాకముందే తీవ్ర ఆటంకాలను ఎదుర్కొంది. అంతర్జాతీయ పంపిణీదారు అయిన యూనివర్సల్ పిక్చర్స్ ఈ డాక్యుమెంటరీ హక్కుల విషయంలో మొదట వెనకడుగు వేసినప్పటికీ.. ఆ తర్వాత ముందుకు వచ్చింది. అంతేకాకుండా టిక్‌టాక్, యూట్యూబ్, మెటా, ఎక్స్ వంటి ప్రముఖ సోషల్ మీడియా వేదికలు ప్రారంభంలో ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ ప్రకటనల ప్రసారాన్ని తిరస్కరించాయి. టెక్ దిగ్గజాల ఈ సెన్సార్‌షిప్‌పై పౌర సమాజం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవ్వడంతో యూట్యూబ్, మెటాలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి.
మరోవైపు ఈ డాక్యుమెంటరీని చూడకుండా ఎలన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. డైరెక్టర్ అలెక్స్ గిబ్నీని "ఓ చేదు మనస్తత్వం ఉన్న వృద్ధుడు" అని.. ఆయనకు ఎలాంటి నైతిక విలువలు లేవని విమర్శించారు. అంతేకాకుండా ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచిన కొన్ని అంశాలపై మస్క్ లీగల్ టీమ్ పరువునష్టం దావా వేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
Alex Gibney: “There was an estimate that what [Elon Musk] did by suddenly cutting USAID would cost through disease and starvation as many as 14M lives. Even if you discount that, we know within a year of those cuts where they were literally burning food going to starving children, 500K children died. This is really a crime against humanity, but he makes a joke about it, I put USAID into the woodchipper. What he put into the woodchipper were children”
— Marco Foster (@MarcoFoster_) October 16, 2026
ఈ డాక్యుమెంటరీ ద్వారా డైరెక్టర్ అలెక్స్ గిబ్నీ కీలకమైన ముగింపునిచ్చారు. ఎలన్ మస్క్‌ను ఓ విజన్ ఉన్న కథానాయకుడిగా చూడటానికి బదులుగా.. ఆయనను 'సోషియోపాథిక్'(సామాజిక స్పృహ లేని వ్యక్తి) అని, సమాజానికి ఆయన ఎంతో ప్రమాదకరమని అభివర్ణించారు. అపారమైన సంపద, అధికారాన్ని సంపాదించిన మస్క్‌కు మానవాళికి మేలు చేయాలనే నిజమైన లక్ష్యం ఏదీ లేదని, కేవలం అధికారాన్ని చెలాయించడం, గెలవడం కోసమే ఆయన ఈ ఆట ఆడుతున్నారని అలెక్స్ గిబ్నీ తేల్చి చెప్పారు.
అలెక్స్ గిబ్నీ ఎవరు?
అలెక్స్ గిబ్నీ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న అమెరికన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. కార్పొరేట్ అక్రమాలు, వ్యవస్థాగత అవినీతి, అధికారాన్ని దుర్వినియోగం చేసే శక్తిమంతుల నైజాలను ఎండగట్టడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన రూపొందించిన 'ఎన్రాన్: ది స్మార్టెస్ట్ గైస్ ఇన్ ది రూమ్ '(2005) ఆస్కార్ నామినేషన్ పొందగా, ఉగ్రవాదంపై పోరు పేరుతో జరిగిన చిత్రహింసలపై తీసిన 'టాక్సీ టూ ది డార్క్ సైడ్ (2007)' చిత్రానికి ఉత్తమ డాక్యుమెంటరీగా ఆస్కార్ లభించింది. అలాగే గోయింగ్ క్లియర్ (2015), ది ఇన్వెంటర్ (2019), నెట్‌ఫ్లిక్స్ సిరీస్ డర్టీ మనీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.














Click it and Unblock the Notifications
