ఆరెంజ్ రంగులో ఆకాశం: న్యూయార్క్ సహా అమెరికా అంతటా
వాషింగ్టన్: వేకువ జామున ఆకాశం ఎలా ఉంటుంది? ప్లెజెంట్‌గా కనిపిస్తుంది. సరికొత్త అందాలతో కనువిందు చేస్తుంది. అప్పుడప్పుడే ప్రసరిస్తోన్న భానుడి కిరణాలు వెచ్చగా స్పృశిస్తుంటాయి. సాధారణంగా ఎక్కడైనా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తుంటాయి. అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీల్లో మాత్రం దీనికి భిన్నమైన వాతావరణం కనిపించింది. జనాలను బిత్తరపోయేలా చేసింది. ఆకాశం నారింజ రంగును పులముకున్నట్లు కనిపించింది.
న్యూయార్క్ మాత్రమే కాదు.. న్యూహ్యాంప్‌షైర్ మొదలుకుని సౌత్ కరోలినా వరకు 18 రాష్ట్రాల్లో ఇదే రకమైన వాతావరణం నెలకొంది. ఆరెంజ్ రంగులో మెరిసిపోయింది. దీనికి కారణం లేకపోలేదు. పొరుగునే ఉన్న కెనడాలో రగిలిన కార్చిచ్చు వల్ల అమెరికాలోని 18 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కార్చిచ్చు వల్ల వెలువడుతున్న పొగ.. వాతావరణం కాలుష్యానికి కారణమైంది. ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయిందక్కడ.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 218కి దిగజారింది. 1960 తరువాత ఈ స్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోవడం ఇదే మొదటిసారి. వాతావరణంలో చోటు చేసుకున్న ఈ మార్పుల కారణంగా పలు విమానాలను కూడా దారి మళ్లించినట్లు న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. లో- విజిబిలిటీ కారణంగా విమానాల రాకపోకల్లో జాప్యం ఏర్పడినట్లు వివరించారు. రైళ్ల రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది.
కొద్దిరోజుల కిందట కెనడా అంతటా కార్చిచ్చు అలముకుంది. వందలాది హెక్టార్ల మేర అడవులు ఇప్పటివరకు దగ్ధమైనట్లు అధికారులు నిర్ధారించారు. కెనడా తూర్పు ప్రాంతంలో దీని తీవ్రత అధికంగా ఉంటోంది. ఆ దేశ ఉష్ణోగ్రతను సైతం ప్రభావితం చేసింది. సాధారణం కంటే రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగింది. అక్కడి నుంచి వెలువడిన దట్టమైన పొగ ప్రభావం- అమెరికాలోని పలు నగరాలపై పడింది.

కాగా వాతావరణం ఒక్కసారిగా ఇలా ఆరెంజ్ రంగులో కనిపించడంతో స్థానికులు తమ మొబైల్ ఫోన్లకు పని పెట్టారు. ఫొటోలు, వీడియోలను తీశారు. దట్టమైన పొగ అలముకోవడం వల్లే సూర్యకిరణాలు అలా పరావర్తనం చెందాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాతావరణం ఇంతకుముందెప్పుడూ చూడలేదని, వాతావరణంలో కాలుష్యం ప్రమాదకరంగా పెరిగిపోయిందంటూ కామెంట్స్ చేస్తోన్నారు. కార్చిచ్చు తీవ్రతకు ప్రస్తుత వాతావరణం అద్దం పడుతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications