సైన్యం చేతికి శ్రీలంక: సీడీఎస్ కీలక ప్రకటన: ఆ వార్తలపై క్లారిటీ
కొలంబో: తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోన్న శ్రీలంకను సైన్యం వశం చేసుకోబోతోందనే వార్తలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడి సైన్యం ప్రయత్నాలు సాగిస్తోందని, ఆ ఉద్దేశంతోనే త్రివిధ దళాధిపతులు అత్యవసరంగా సమావేశం అయ్యారంటూ విస్తృతంగా కథనాలు వెలువడ్డాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అక్కడ లేకపోవడం వల్ల ఇక సైన్యమే దిక్కయిందనే ప్రచారం ఊపందుకుంది.

పాలకులు లేరు..
ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టలేకపోవడం వల్ల తలెత్తిన జనాగ్రహాన్ని తట్టుకోలేక స్వయంగా దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స పారిపోవడం, ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె రాజీనామా చేయడంతో అక్కడ ప్రభుత్వం అనేది లేదు. రణిల్ విక్రమసింఘె రాజీనామా తరువాత మంత్రులు కూడా తమ పదవులకు గుడ్‌బై చెప్పారు. ఒక దేశానికి అధ్యక్షుడు గానీ, ప్రధాని గానీ, మంత్రులు గానీ లేని పరిస్థితి ఏర్పడింది.

సైన్యం రంగంలో..
ఈ పరిణామాల మధ్య ఇక సైన్యం రంగంలోకి దిగిందనే ప్రచారం జోరుగా సాగింది. సైనిక ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందంటూ వార్తలొచ్చాయి. పరిపాలన వ్యవస్థ గాడి తప్పకముందే సైన్యమే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. శ్రీలంకలో సైనిక ప్రభుత్వం ఏర్పాటు కావడమంటూ జరిగితే- దానికి ముగింపు ఇప్పట్లో ఉండకపోవచ్చనే వాదనలు సైతం వినిపించాయి.

ఆ ఆలోచన లేదంటూ..
ఈ వార్తలు కథనాలను శ్రీలంక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తోసిపుచ్చింది. తాము అలాంటి ప్రయత్నాలేవీ చేయట్లేదంటూ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, సీడీఎస్ జనరల్ శావేంద్ర సిల్వా స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. గాలె ఫేస్ ప్రొటెస్ట్ సైట్‌కు వెళ్లాలనే ఆలోచన చేయట్లేదనీ పేర్కొన్నారు. ఆందోళనలు, నిరసన ప్రదర్శనలను అడ్డుకోవాలని భావించట్లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియా సహా ఇతర ప్రసార మాధ్యమాల్లో వస్తోన్న కథనాల్లో వాస్తవం లేదని చెప్పారు.

నిరసనలను..
సీడీఎస్ జనరల్ శావేంద్ర సిల్వ ఈ ప్రకటన విడుదల చేసిన కొద్దిసేపటికే ఫీల్డ్ మార్షల్ శరత్ ఫోన్సెక స్పందించారు. సైన్యం తరఫున మరో ప్రకటన విడుదల చేశారు. ప్రజాందోళనలను అణచివేయాలనే ఉద్దేశం తమకు లేదని తేల్చి చెప్పారు. ఎలాంటి మిలటరీ ఆపరేషన్లకూ పూనుకోవట్లేదని పేర్కొన్నారు. ప్రజలు తమ ఆందోళనలను కొనసాగించుకోవచ్చని స్పష్టం చేశారు. హింసకు పాల్పడకుండా, శాంతియుత వాతావరణంలో ఆందోళనలు చేపట్టాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రజాగ్రహం..
గతి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థ.. నెలల తరబడి పట్టాలెక్కకపోవడానికి నిరసనగా లక్షలాది మంది లంకేయులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స నివాసంపై దండెత్తారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లారు. ఆ భవనం ప్రస్తుతం పిక్నిక్ స్పాట్‌లాగా మారింది. రోజూ వందలాది మంది అక్కడికి చేరుకుంటోన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications