శ్రీలంక మంత్రివర్గం రాజీనామా -ప్రధాని మినహా : మరో సంక్షోభం దిశగా..!!
శ్రీలంకలో పరిస్థితులు దిగజారుతున్నాయి. రోజురోజుకీ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ఆగ్రహంతో నిరసనలకు దిగుతున్నారు. వారిని నియంత్రించటం ప్రభుత్వానికి సాధ్య పడటం లేదు. ప్రజల ఆందోళనలతో దేశ మంత్రివర్గం పైన ప్రభావం పడింది. ఆర్థిక సంక్షోభం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ మంత్రివర్గం రాజీనామా చేసింది. దేశ ప్రధానికి తమ రాజీనామా పత్రాలను మంత్రులు అందించారు. 26 మంది మంత్రులు రాజీనామా లేఖలు పంపారు. సంక్షోభం నేపథ్యంలో మార్చి 31 నుంచి ఆ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు అధ్యక్షుడు రాజపక్సే. శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్స సైతం రాజీనామా చేసారంటూ వార్తలు వచ్చాయి. దీనిని ప్రధాని కార్యాలయం ఖండించింది.
అవి తప్పుడు వార్తలుగా పేర్కొంది. రాజీనామాపై వస్తున్న వార్తలను ప్రధాని మహిందా రాజపక్స మీడియా సెక్రటరీ తిరస్కరించారు. కానీ, రాజకీయంగానూ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ప్రజలు ఏకంగా అధ్యక్షుడి ఇంటిని మట్టడించారు. భారీగా నిరసనల నేపథ్యంలో అత్యవసర పరిస్థితి సహా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఆర్దిక పరిస్థితి దారుణంగా ఉంది. కిలో బియ్యం రెండు వందల రూపాయాలకు పైగా చేరింది. డీజిల్ దొరకటం లేదు. వీధుల్లో విద్యుత్ దీపాలు సైతం నిర్వహించే పరిస్థితి కనిపించటం లేదు. విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. అయితే, సంక్షోభం తమ నిర్ణయాల ఫలితాలు కావని.. కరోనా మహమ్మారి మూలంగానే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని తమ చర్యలసైతం ను సమర్థించుకున్నారు.

దేశంలో పరిస్థితులను చక్కదిద్దుతాననే హామీతో 2019లో రాజపక్సే అధికారంలోకి వచ్చారు. కానీ, పూర్తిగా పరిస్థితులు తారుమారు అయ్యాయి. దేశ వ్యాప్తంగా సోషల్ మీడియా పైన ఆంక్షలు విధించారు. అదివారం మధ్నాహ్నం తరువాత ఆ ఆదేశాలను ఉప సంహరించుకున్నారు. పెట్రోలు..ఆహారం..మందుల కొరత తీవ్ర స్థాయికి చేరింది. వీటిని తట్టుకోలేని సాధారణ ప్రజలు రోడ్ల పైకి వచ్చి ఆందోళనలకు దిగారు. అందులో దాదాపుగా 664 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, మంత్రివర్గం ఇప్పుడు రాజీనామా చేయటం ద్వారా..రాజకీయంగానూ పరిస్థితులు మారుతున్నాయి. దీంతో.. రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులకు ప్రస్తుత పరిణామాలు కారణం అవుతాయో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications