గంగానది తీరాన టీటీడీకి 15 ఎకరాలు కేటాయింపు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం 86,601 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,111 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.72 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 25 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పట్టింది.
ఆ ఒక్క రోజే 4.32 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. రికార్డు స్థాయిలో 2.16 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీని అందిస్తున్నారు. అదనపు షెడ్లను అమర్చారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో సనాతన ధర్మ ప్రచారానికి, శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక సేవలను మరింత చేరువ చేయడానికి మరో కీలక అడుగు పడింది. బీహార్ రాజధాని పాట్నా సమీపంలో గంగా నది తీరానికి దగ్గరగా, జాతీయ రహదారి పక్కన శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం బీహార్ ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నేడు బీహార్ కు వెళ్లారు. పాట్నా సచివాలయంలో ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించి, శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. ఈ సమావేశంలో బీహార్ చీఫ్ సెక్రటరీ అమృత్ ప్రత్యయ్ పాల్గొన్నారు. ప్రతిపాదిత ఆలయ ప్రాంగణంలో ప్రధాన దేవాలయంతో పాటు కళ్యాణ మండపం, పుష్కరిణి, యాత్రికుల సౌకర్యాలకు అవసరమైన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు కల్పిస్తారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టనున్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం ద్వారా సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తరించాలనే లక్ష్యంతో టీటీడీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో అన్ని రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో కార్యాచరణ కొనసాగుతోంది. ఇప్పటికే అస్సాంలోని గౌహతిలో ఆలయ నిర్మాణం కోసం 10 ఎకరాల భూమి కేటాయింపు పూర్తయింది. ఇప్పుడు బీహార్‌లో కూడా శ్రీనివాసుడి ఆలయం నిర్మితం కానుంది.












Click it and Unblock the Notifications