ఆమె గనుక లేకపోయి ఉంటే..: ఫ్లోరిడా కాల్పుల్లో 'టీచర్' కోణం..
ఫ్లోరిడా: ఆ ఒక్క టీచర్ గనుక అప్రమత్తంగా వ్యవహరించి ఉండకపోతే.. అక్కడ మరింత రక్తపాతం జరిగి ఉండేది. మరిన్ని శరీరాలు బుల్లెట్లతో ఛిద్రమైపోయేవేవి. ఎంతోమంది కన్నవారికి కడుపుశోకం మిగిలేది. కానీ ఆ టీచర్ సమయ స్ఫూర్తి విద్యార్థుల జీవితాలను కాపాడింది. ఆమె శాంతి విశ్వనాథన్. భారత సంతతికి చెందిన టీచర్.
ఫ్లోరిడా కాల్పులు:
రెండు రోజుల క్రితం ఫ్లోరిడాలోని మార్జోయ్ స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్‌లో నికోలస్ క్రూజ్ అనే టీనేజర్.. 17మంది చిన్నారులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో స్కూల్లో పాఠాలు చెబుతున్న శాంతి విశ్వనాథన్.. ఉగ్రవాది కాల్పుల నుంచి చాలామంది విద్యార్థులను కాపాడగలిగారు.

క్షణాల్లో అప్రమత్తమైన టీచర్..:
ఉగ్రవాది కాల్పులు ప్రారంభించిన సమయంలో శాంతి.. ఒక క్లాస్ రూమ్‌లో మ్యాథ్స్ బోధిస్తున్నారు. కాల్పుల శబ్దం విన్న వెంటనే ఆమె అప్రమత్తమయ్యారు. క్షణాల్లో క్లాస్ రూమ్ డోర్ లాక్ చేసి.. విద్యార్థులందరిని నేలపై పడుకోవాలని సూచించారు. మధ్యలో పోలీసులు వచ్చి తలుపులు కొట్టినా ఆమె తలుపు తీయలేదు.

పోలీసులు వచ్చి తీయమన్నా..:
ఉగ్రవాదే తాను పోలీసునని చెప్పి తలుపు తీయమంటున్నాడన్న అనుమానంతో ఆమె ఎంతకీ డోర్ తెరవలేదు. ముందు కిటికీలు తెరిచి చూసి.. పోలీసులే అని నిర్దారించుకున్న తర్వాత ఆమె డోర్స్ ఓపెన్ చేశారు. విశ్వనాథన్ లాగే చాలామంది టీచర్స్ ఆయా క్లాస్ రూమ్స్ లోని విద్యార్థులను రక్షించడంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. వారందరిని స్కూల్ యాజమాన్యం అభినందించింది.

మెచ్చుకుంటున్న పేరెంట్స్:
పిల్లలను కాపాడటంలో ఆమె ప్రదర్శించిన సమయ స్ఫూర్తిని డాన్ జార్బో అనే ఓ విద్యార్థి తల్లి ప్రశంసించారు. పోలీసులు వెళ్లినా సరే.. 'వీలైతే తలుపులు బద్దలుకొట్టుకోండి.. డోర్స్ తీసేది లేదు' అంటూ తెగేసి చెప్పారు. ఆమె సమయ స్ఫూర్తి వల్లే తమ బిడ్డల ప్రాణాలు దక్కాయని తెలిపారు.












Click it and Unblock the Notifications