యుద్ధ విమానాన్ని నడిపిన రాణి.. మురిసిపోయిన రాజు

థాయిలాండ్ రాయల్ ఫ్యామిలీ రాజసానికి మాత్రమే కాదు.. అసాధారణ సాహసాలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని రాజకుటుంబానికి చెందిన రాణి సుతిదా మరోసారి నిరూపించారు. సాధారణంగా రాణులు అధికారిక కార్యక్రమాలు, సామాజిక సేవలకు పరిమితమవుతారని అనుకునే భావనను తుడిచిపెట్టేస్తూ.. ఆమె ఏకంగా శక్తివంతమైన 'గ్రిపెన్' యుద్ధ విమానంలో ఒంటరిగా గాల్లోకి ఎగిరి అందరినీ విస్తుపోయేలా చేశారు. ఈ అరుదైన ఫీట్‌తో గగనతలంలో సరికొత్త శకానికి శ్రీకారం చుట్టిన రాణి సాహసాన్ని ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ, ఏవియేషన్ వర్గాలు ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి.

గ్రిపెన్ ఫైటర్ జెట్‌లో ఒంటరిగా.. కింగ్ సమక్షంలో చారిత్రక ఘట్టం

దక్షిణ థాయిలాండ్‌లోని సూరత్ థానీ ప్రావిన్స్‌లో ఉన్న వింగ్ 7 ఎయిర్ బేస్ ఈ చారిత్రక ఘట్టానికి వేదికైంది. స్వీడన్ సాంకేతికతతో తయారైన సింగిల్ సీటర్ జేఏఎస్ 39 సీ గ్రిపెన్ (JAS 39 C Gripen) సూపర్ సోనిక్ ఫైటర్ జెట్‌ను రాణి సుతిదా ఒంటరిగా నడిపారు. విమానం ఎక్కడానికంటే ముందు రన్ వే పైకి వచ్చి స్వయంగా ఫ్లైట్ ప్లాన్‌ను పరిశీలించి, యుద్ధ విమాన భద్రతా తనిఖీలు పూర్తి చేశారు. ఆ తర్వాత గాల్లోకి లేచి ఆకాశంలో అద్భుత విన్యాసాలు పూర్తి చేసి సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ఈ అపూర్వ క్షణాన్ని థాయిలాండ్ రాజు మహా వజ్రాలాంగ్‌కార్న్ స్వయంగా వీక్షించడం విశేషం.

Thailand Queen Suthida Completes Historic First Solo Flight in Gripen Fighter Jet at Wing 7 Base

రాణి సాహసానికి రాజు ఘన సత్కారం

యుద్ధ విమానంలో ఒంటరిగా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి కిందకు దిగిన రాణి సుతిదాకు రాజు మహా వజ్రాలాంగ్‌కార్న్ స్వయంగా పూలగుత్తిని ఇచ్చి అభినందించారు. అంతేకాకుండా, గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను ఒంటరిగా నడిపిన వీరత్వానికి ప్రతీకగా అత్యంత విశిష్టమైన 'గ్రిపెన్ ఆర్డర్ గోల్డెన్ ప్యాచ్' అనే ప్రత్యేక మిలిటరీ పతకాన్ని ఆమెకు బహుకరించి గౌరవించారు. రాజు, రాణి ఇద్దరి ముఖాల్లో కనిపించిన ఆనందం, గర్వం అక్కడి మిలిటరీ అధికారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

150 ఏళ్ల తర్వాత సింహాసనంపై యువరాణి.. 20 ఏళ్లకే దేశాన్ని ఏలే రాజకుమారి
150 ఏళ్ల తర్వాత సింహాసనంపై యువరాణి.. 20 ఏళ్లకే దేశాన్ని ఏలే రాజకుమారి

ఏవియేషన్ రంగాన వేలాది గంటల అనుభవం!

రాణి సుతిదాకు విమానాలు నడపడం కొత్తేమీ కాదు. పైలట్‌గా ఆమెకు సుదీర్ఘమైన, ఘనమైన అనుభవం ఉంది. ఇప్పటివరకు వివిధ రకాల విమానాల్లో ఏకంగా 1,188 గంటలకు పైగా గాల్లో ప్రయాణించిన అరుదైన రికార్డు ఆమె సొంతం. 2010 మే 13న బ్యాంకాక్‌లోని వింగ్ 6 ఎయిర్ బేస్‌లో సెస్నా T-41D విమానాన్ని తొలిసారిగా నడపడం ద్వారా ఆమె పైలట్ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత సెస్నా, పిలాటస్, పైపర్ వంటి చిన్న విమానాలతో పాటు భారీ బోయింగ్ 737 ప్యాసింజర్ విమానాలను కూడా ఆమె సునాయాసంగా నడిపారు. ఫైటర్ జెట్లకు సంబంధించి గతంలో రెండు సీట్లు ఉండే గ్రిపెన్ జేఏఎస్ 39డి లో శిక్షణ పొందిన ఆమె, ఇప్పుడు సింగిల్ సీటర్ జెట్‌లో ఒంటరిగా ఎగిరి తన సత్తా చాటుకున్నారు.

ఏడేళ్ల నిరీక్షణకు తెర.. లండన్ బాట పట్టిన యువరాజు, యువరాణి
ఏడేళ్ల నిరీక్షణకు తెర.. లండన్ బాట పట్టిన యువరాజు, యువరాణి

సవాలుతో కూడిన ఎయిర్‌పోర్ట్‌లోనూ కో-పైలట్‌గా ల్యాండింగ్!

రాణి సుతిదా కేవలం వ్యక్తిగత సరదా కోసమే కాకుండా అధికారిక, దౌత్యపరమైన పర్యటనల్లోనూ రాజుతో కలిసి విమానాలను నడుపుతుంటారు. విదేశీ, స్వదేశీ పర్యటనల్లో రాచరిక విమానానికి (రాయల్ ఎయిర్‌క్రాఫ్ట్) రాజు వజ్రాలాంగ్‌కార్న్‌తో కలిసి ఆమె కో-పైలట్‌గా వ్యవహరిస్తుంటారు. గతేడాది ఏప్రిల్‌లో భూటాన్ పర్యటనకు వెళ్లిన సమయంలో, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, క్లిష్టమైన ల్యాండింగ్‌కు పేరుగాంచిన 'పారో ఎయిర్‌పోర్ట్'లో రాచరిక విమానాన్ని వీరిద్దరూ సురక్షితంగా ల్యాండ్ చేసి తమ పైలటింగ్ నైపుణ్యాన్ని చాటుకున్నారు. మిలిటరీ, పౌర విమానాలన్నింటిపై పూర్తి పట్టు సాధించిన థాయిలాండ్ రాణి చేసిన ఈ సోలో ఫైటర్ జెట్ ప్రయాణం ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+