Turkeyearthquake: టర్కీ, సిరియాల్లో మృత్యుఘోష.. శిథిలాల్లో వందల మృతదేహాలు..
టర్కీ, సిరియాల్లో భూ కంప తీవ్రతకు చనిపోయిన వారి సంఖ్య 21 వేలు దాటింది.
టర్కీ, సిరియాలో మృత్యుఘోష కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ మరణాల సంఖ్య 21 వేలు దాటింది. టర్కీలో 17,674 మంది ప్రకృతి విపత్తుకు బలి కాగా.. 72,879 మంది గాయపడ్డారని వైస్ ప్రెసిడెంట్ ఫుట్ ఓక్టే గురువారం తెలిపారు. ఇటు సిరియాలో 3,377 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో వాయువ్యంలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో 2,030 మంది, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో 1,347 మంది మరణించారు.

72 గంటలు
టర్కీలోని భూకంప ప్రభావిత ప్రావిన్సులలో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతోన్నాయి. అయితే భూ కంపం వచ్చి 72 గంటలు దాటడంతో శిథిళాల్లో చిక్కుకున్న వారు బతకడం కష్టమని తెలుస్తోంది. భూకంప ప్రభావిత ప్రావిన్సులలో శోధన, రెస్క్యూ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి మూడు నెలల అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. టర్కీ, సిరియాల్లో సోమవారం తెల్లవారుజామున భారీ భూ కంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రతతో వచ్చింది. ఆ తర్వాత చాలాసార్లు భూమి కంపించింది.

75 దేశాలు
అదానా, అడియామాన్, దియార్‌బాకిర్, గాజియాంటెప్, హటే, కిలిస్, మలత్యా, ఉస్మానీ, సాన్‌లియుర్ఫాతో సహా 10 ప్రావిన్సుల్లో 13 మిలియన్ల మంది ప్రజలు భూ కంప ప్రభావానికి లోనయ్యారు. టర్కీకి 75 దేశాలు, 16 అంతర్జాతీయ సంస్థలు సహాయం చేస్తున్నాయని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్‌లుట్ కావుసోగ్లు గురువారం తెలిపారు. 56 దేశాల నుంచి 6,479 మంది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో ఉన్నారని పేర్కొన్ారు. మరో 19 దేశాలకు చెందిన బృందాలు 24 గంటల్లో టర్కీకి చేరుతాయని చెప్పారు.

అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్
టర్కీ సహాయక చర్యల్లో భారత్ ముందుంది. భారత సైన్యం విపత్తు సహాయక బృందాలు టర్కీకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.భారత అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ (ADGPI) గురువారం టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఒక టర్కీ మహిళను కౌగిలించుకున్న మహిళా భారత ఆర్మీ అధికారి చిత్రాన్ని ట్వీట్ చేసింది.

వాట్సప్
శిథిలాల కింద చిక్కుకున్న ఓ 20 ఏళ్ల విద్యార్థిని వాట్సప్ కాపాడింది. టర్కీలోని ఓ అపార్ట్‌మెంట్ భవన శిథిలాల కింద చిక్కుకున్న ఆ విద్యార్థి.. వాట్సప్‌లోస్నేహితులకు వీడియో సందేశం పంపింది. అందులో తాను ఏ ప్రాంతంలో ఉన్నది చెప్పింది. సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని శిథిలాలను తొలగించి ఆ విద్యార్థినిని కాపాడారు.












Click it and Unblock the Notifications