విడాకులకూ వచ్చేసిందో యాప్..
బ్రిటన్ : వేగంగా పరుగులు పెడుతున్న అభివృద్దితో పాటే మనిషి జీవన విధానంలోను ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏదైనా సరే నచ్చలేదంటే వెంటనే ప్రత్యమ్నాయం వెతుక్కోవడమో.. లేక మరొకటో అక్కడితో తేలిపోవాలంతే. ఇప్పుడంతా షార్ట్ అండ్ స్వీట్ టైప్ ట్రెండ్. బంధాలైనా అంతే, నచ్చకపోతే రాజీపడ్డాలుండవు, తెగదెంపులు చేసేసుకుని ఎవరి దారి వారు చూసుకోవడమే.
అందుకే ప్రపంచంలోను ఏటా విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది. అయితే విడాకులంటే.. కోర్టుల చుట్టూ తిరగాలి, లాయర్లను నియమించుకోవాలి, ఇదంతా ఖర్చుతో కూడిన వ్యవహారమని వెనక్కి తగ్గేవాళ్లు లేకపోలేదు. ఇలాంటి వాళ్ల కోసమే యూకేలో ఇప్పుడో యాప్ అందుబాటులోకి రానుంది.

చాలా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఈ యాప్ ద్వారా విడాకులు పొందవచ్చట. ఇందుకోసం చేయాల్సిందల్లా విడాకులు కావాలనుకున్న జంటలు యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే. యూకేలో విడాకులు పొందాలంటే, ఆ ప్రక్రియంతా చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో దీనికి చెక్ పెట్టాలని భావించిన కొంతమంది ఈ యాప్ ను రూపొందించినట్టుగా సమాచారం.
ఈ కొత్త యాప్ ద్వారా విడాకులు పొందాలనుకున్న జంట కేవలం పదుల
స్థాయి పౌండ్స్ ఖర్చుతోనే తమ వివాహా బంధానికి గుడ్ బై చెప్పుకోవచ్చట. అయితే ఇంకా అందుబాటులోకి రాని ఈ యాప్ ని సెప్టెంబర్ లో లాంచ్ చేయాలని దీని సహా వ్యవస్థాపకులు కేట్ డేలి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇంగ్లాండ్ లో ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడ కొత్తగా పెళ్లి చేసుకుంటున్న జంటల్లో దాదాపుగా 42 శాతం మంది విడాకుల బాట పడుతుండడం గమనార్హం. ఏదేమైనా ఈ కొత్త యాప్ తో ఇంట్లో కూర్చొనే కేవలం మొబైల్ ద్వారా విడాకుల తతంగాన్ని నడిపించేసే వెసులుబాటు త్వరలోనే యూకే ప్రజలకు అందుబాటులోకి రానుంది.












Click it and Unblock the Notifications