భూమి ‘మిస్సింగ్ మిస్టరీ’ వీడింది.. ఆ 5 శాతం మూలకం.. ‘సిలికాన్’
భూమి అంతర్భాగంలో 5 శాతం మిస్సింగ్ ఎలిమెంట్ (మూలకం) ఏమిటనే మిస్టరీ వీడిపోయింది. 85 శాతం ఇనుము, 10 శాతం నికెల్ కాగా, మిగిలిన మిస్టీరియస్ ఎలిమెంట్.. సిలికాన్ అని జపాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
లండన్: భూమి అంతర్భాగంలో 85 శాతం ఇనుము, 10 శాతం నికెల్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఎప్పుడో కనుగొన్నారు. అయితే మిగిలిన 5 శాతం మిస్సింగ్ మూలకం ఏమిటన్నది ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు అంతు చిక్కకుండా ఉండిపోయింది.
ఇప్పుడు జపాన్ కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ మిస్సింగ్ మూలకాన్ని కనుగొంది. ఆ 5 శాతం సిలికాన్ అని వారు పేర్కొంటున్నారు. ఇటీవల శాన్ ప్రాన్సిస్కోలో అమెరికా జియోఫిజికల్ యూనియన్ ఏర్పాటు చేసిన ఓ సదస్సులో వారు ఈ విషయాన్ని వెల్లడించారు.
భూ ఉపరితలానికి మూడు వేల కిలోమీటర్ల లోతున ఉండే భాగాన్ని 'కోర్'గా వ్యవహరిస్తారు. ఇది దాదాపు 1200 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుందన్నది శాస్త్రవేత్తల అంచనా. ఆ వ్యాసార్థంలో 85 శాతం ఇనుము, 10 శాతం నికెల్ ఉంటాయని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు పలు ప్రయోగాల ద్వారా అంచనా వేయగలిగారు.

ఆ మిగతా 5 శాతం మూలకం ఏమై ఉంటుందన్నది ఇంతకాలం అంతుచిక్కని రహస్యంలా ఉండిపోయింది. ఎందుకంటే.. ప్రపంచంలో అత్యంత లోతైన గని కూడా భూ ఉపరితలం నుంచి కేవలం 4 కిలోమీటర్ల లోతులోనే ఉంటుంది.
అంతకన్నా లోతున.. ఎక్కడో భూమి మధ్య భాగంలో ఉండే కోర్ ఉన్న ప్రదేశానికి వెళ్లడం అసాధ్యం కావడంతో అంత లోపలికి వెళ్లి పరిశోధనలు జరిపే అవకాశమే లేదు. అయితే జపాన్ శాస్త్రవేత్తల బృందం కొన్ని దశాబ్దాలుగా ఈ మిస్సింగ్ మూలకాన్ని కనుగొనేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
దీని కోసం భూమిపైనే వారు మరో భూమిని సృష్టించారు. 85 శాతం ఇనుము, 10 శాతం నికెల్ ను 6000 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి దానిపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి.. చివరికి అది భూమి ఆకారం సంతరించుకునేలా చేశారు.
అప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్నట్లుండి సిలికాన్ పుట్టుకొచ్చింది. దీంతో ఇన్నాళ్లూ అంతు చిక్కకుండా ఉండిపోయిన ఆ పదార్థం సిలికానే అనే నిర్ధారణకు శాస్త్రవేత్తలు వచ్చారు. ఆ సమయంలో భూమిలోని 'కోర్' నుంచి ఎలాంటి భూప్రకంపనలు అయితే వస్తాయో అలాంటి ప్రకంపనలే శాస్త్రవేత్తలు సృష్టించిన మినీ భూమి నుంచి కూడా వెలువడ్డాయి. దీంతో వారి వాదనకు మరింత బలం చేకూరినట్లయింది.
భూమి ఏర్పడిన కొత్తలో సూర్యుడిలాగే ఉండేదనే సిద్ధాంతాన్ని నిరూపించేందుకు, 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడడానికి దారితీసిన పరిస్థితులేవో తెలుసుకోవడానికి జపాన్ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం ఉపయోగపడుతుందని అందరూ భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications