ఇది రియాలిటీ షో కాదు: ట్రంప్‌పై మండిపడ్డ ఒబామా
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష బరిలో దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాషింగ్టన్‌లో ఆయన మాట్లాడుతూ అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో అడుగుపెట్టడం అంటే రియాలిటీ షోలో పాల్గొనడం అనుకుంటున్నావా? అని ప్రశ్నించారు.
అమెరికా అధ్యక్ష పదవి అంటే రియాలిటీ షోలో పాల్గొనడం లాంటిది కాదని హితవు పలికారు. ట్రంప్ టెలివిజన్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన వ్యక్తిగా అభివర్ణించారు. ఇది రియాలిటీ షో కాదని, అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిల్చున్నామనే వాస్తవాన్ని గ్రహించాలని హెచ్చరించారు.

ఎంతో ఉన్నతమైన ఈ పదవిని సీరియస్‌గా స్వీకరించే వ్యక్తినే ఈ పదవి వరిస్తుందని చెప్పారు. ట్రంప్ మాత్రం అధ్యక్ష పదవి అంటే వినోదంగా భావిస్తున్నాడని ఒబామా మండిపడ్డారు. అమెరికాలోకి ముస్లింలను అనుమతించనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి అర్హుడు కాదని ఒబమా పేర్కొన్నారు.
రిపబ్లికన్ పార్టీ ఇప్పటికైనా తమ ప్రతినిధిగా ఎవరిని ఎంచుకోవాలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. విదేశాంగ విధానం విషయంలో కూడా ట్రంప్ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. అమెరికా ప్రమాణాలు, వాస్తవిక ధోరణితో అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన సూచించారు.
ఇవే నిబంధనలు రేసులో ఉన్న అందరి అభ్యర్థులకు వర్తిస్తాయని ఒబామా సూచించారు. రిపబ్లికన్ పార్టీకి ఓటు వేయాలనుకునేవారు ట్రంప్ అమెరికాను ఏవిధంగా చేయాలనుకుంటున్నాడో ఆలోచించి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఫ్లోరిడా మాజీ గవర్నర్ జెబ్ బుష్ ఇప్పటికే తన ఓటును డొనాల్డ్ ట్రంప్‌కు వేయనని సామాజిక మాధ్యమం సోషల్ మీడియాలో పోస్టు చేశారు.












Click it and Unblock the Notifications