న్యూయార్క్ హై స్కూల్ లో పేలుడు
న్యూయార్క్: పాఠశాలలో పేలుడు సంభవించి ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన న్యూయార్క్ లో జరిగింది. ఈ ప్రమాదంలో స్కూల్ మూడు అంతస్తుల భవనం నేలమట్టం అయ్యిందని న్యూయార్క్ మేయర్ బిల్ డీ. బ్లాసియో తెలిపారు.
మేయర్ బిల్ డీ, బ్లాసియో, న్యూయార్క్ పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. న్యూయార్క్ లోని యోషితా ప్రాంతంలో జాన్ ఎఫ్. కెండ్లీ హై స్కూల్ ఉంది. గురువారం అర్దరాత్రి దాటిన తరువాత స్కూల్ క్యాంపస్ లోని మూడు అంతస్తుల భవనంలో పేలుడు సంభవించింది.

ఆ సందర్బంలో భవనంలో నలుగురు కార్మికులు ఉన్నారు. ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.
గ్యాస్ సిలిండర్ లీక్ కావడం వలన పేలుడు సంభవించిందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే పేలుడుకు మరేమైనా కారణాలు ఉన్నాయా అని అధికారులు ఆరా తీస్తున్నారు. శుక్రవారం స్కూల్ కు సెలవు ప్రకటించారు. గాయాలైన వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications