ఈరోజు సూర్యగ్రహణం.. భారతదేశంలో ఎందుకు కనిపించదు

డిసెంబర్ 4 శనివారం నాడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాదికి ఇదే చివరి గ్రహణం.

ఈ సూర్యగ్రహణం దక్షిణ అర్ధగోళంలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తుందని నాసా తెలిపింది.

అయితే, ఇది భారతదేశంలో కనిపించదు. ఎందుకంటే భారతదేశం దక్షిణార్థగోళంలో లేదు.

భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందన్నది తెలిసిందే. భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళరేఖలోకి వస్తే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

కేవలం అంటార్కిటికాలో మాత్రమే శనివారం సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది.

సెయింట్ హెలెనా, నమీబియా, లెసెతో, దక్షిణాఫ్రికా, దక్షిణ జార్జియా, శాండ్‌విచ్ దీవులు, క్రోజెట్ ఐలాండ్, ఫాక్‌లాండ్ దీవులు, చిలీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడగలరు.

ఈ గ్రహణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

శనివారం కొన్ని ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణమే కనిపిస్తుంది.

గ్రహణం గురించి మూఢనమ్మకాలు

గ్రహణం అనగానే ఏదో భయంకరమైన విపత్తు రాబోతోందని నమ్మేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు.

హిందూ పురాణాల్లో రాహువు, కేతువుల కథ తెలిసిందే.

గ్రహణం గురించి శాస్త్రీయ అవగాహన లేని రోజుల్లో మనుషులు అనేక రకాల కల్పనలు చేశారు. కొన్ని క్షణాల పాటు ప్రపంచాన్ని ఆవరించే చీకటిపై కథలల్లారు.

గ్రహణం మనుషులను ఎంత ఆశ్చర్యపరిచిందో అంత భయపెట్టింది.

"మిట్టమధ్యాహ్నం చీకటిని చూసాక ఈ ప్రపంచంలో ఇక దేనికీ నేను ఆశ్చర్యపోను" అని 17వ శతాబ్దపు గ్రీకు కవి ఆర్కిలోకస్ అన్నారు.

తరువాత కాలంలో గ్రహణం వెనుక కారణాలను సైన్స్ తేటతెల్లం చేసినా, ఇప్పటికీ దాని చుట్టూ ఎన్నో మూఢనమ్మకాలు అల్లుకుని ఉన్నాయి.

"పదిహేడవ శతాబ్దం చివరి వరకు గ్రహణాలు ఎందుకు సంభవిస్తాయో, నక్షత్రాలు ఎందుకు రాలిపోతాయో చాలా మందికి తెలీదు. కానీ, ఎనిమిదవ శతాబ్దం నుంచే ఖగోళ శాస్త్రవేత్తలకు గ్రహణాల వెనుక శాస్త్రీయ కారణాల పట్ల అవగాహన ఉంది" అని కాలిఫోర్నియాలోని గ్రిఫిత్ అబ్జర్వేటరీ డైరెక్టర్ ఎడ్విన్ క్రప్ వెల్లడించారు.

"అప్పట్లో సమాచార మాధ్యమాలు విస్తృతంగా లేకపోవడం వలన గ్రహణం గురించి ప్రజలందరికీ తెలియజెప్పడం సాధ్యపడలేదు. ప్రాచీన కాలంలో మనిషి దినచర్య సూర్యుడితో మొదలై సూర్యుడితోనే ముగిసేది. ప్రకృతి నియమాలను అనుసరించి వారు జీవనం సాగించేవారు. ఈ నియమాల్లో ఏదైనా మార్పు సంభవిస్తే అది విపత్తు లేదా అశాంతిని కలుగజేసేదని నమ్మేవారు" అని అన్నారు.

గత ఏడాది జూన్‌లో ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో కనిపించిన సూర్యగ్రహణం చిత్రం

వివిధ నాగరికతల్లో ప్రచారంలో ఉన్న కథలు

గ్రహణం కారణంగా చీకట్లు అలుముకోవడాన్ని చూసి ప్రాచీన కాలంలో ప్రజలు భయపడేవారు. సూర్యుడిని ఎవరో రాక్షసుడు మింగేస్తున్నాడని భావించేవారు. అనేక నాగరికతల్లో ఇలాంటి మూఢనమ్మకాలే కనిపిస్తాయి.

పశ్చిమ ఆసియాలో సూర్యుడిని పెద్ద డ్రాగన్ మింగేస్తోందని నమ్మేవారు. దాన్ని పారదోలడానికి నగారాలు వాయించేవారు.

స్వర్గానికి చెందిన ఓ కుక్క సూర్యుడిని మింగేస్తోందని చైనాలో భావించేవారు. పెద్ద ప్యూమా (చుక్కలు, చారలు లేని పులి) మింగేస్తోందని పెరు వాసులు నమ్మేవారు. జంట తోడేళ్లు సూర్యుడిపై దాడి చేస్తున్నాయని వైకింగ్స్ నమ్మేవారు.

"వివిధ నాగరికతలు విలసిల్లిన ప్రాంతాల్లో ప్రకృతి ఎంత ఔదార్యంగా ఉంటే గ్రహణం గురించి కథలు ఔదార్యంగా ఉండేవి. కష్టమైన పరిస్థితులు ఉన్నచోట గ్రహణాల గురించి భయంకరమైన కథలు పుట్టుకొచ్చాయి. నీరు, ఆహారం పుష్కలంగా దొరికే ప్రాంతాల్లో భగవంతుడు లేదా విశ్వాన్ని నడిపించే మహాశక్తి పట్ల ప్రేమ ఉంటుంది. అక్కడి పురాణాల్లో గాధలు కూడా అలాగే ఉంటాయి" అని ఖగోళ శాస్త్రవేత్త, యూనివర్శిటీ ఆఫ్ ది వెస్ట్రన్ కేప్‌లో ప్రొఫెసర్ జరిటా హోల్‌బ్రూక్ వివరించారు.

మధ్యయుగ ఐరోపాలో ప్లేగులు, యుద్ధాలు ప్రజలను పీడించాయి. అందుకే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం అనగానే వారికి బైబిల్‌లో వివరించిన ప్రళయం (డూమ్స్‌డే) గుర్తుకొస్తుంది.

ప్రపంచం అంతమైపోయే రోజు సూర్యుడు నల్లగా మారతాడని, చంద్రుడు ఎరుపు రంగులోకి మారతాడని బైబిల్‌లో పేర్కొన్నారు.

నిజానికి సూర్యగ్రహణం, చంద్రగహణం వచ్చే రోజుల్లో అదే జరుగుతుంది. అప్పట్లో ప్రజల ఆయుష్షు తక్కువగా ఉండేది. జీవితకాలంలో ఒక్కసారే సంపూర్ణ గ్రహణాలను చూడగలిగేవారు. అందుకే దాని చుట్టూ ఎన్నో భయాలు, కల్పనలు అల్లుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)  

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+