రక్తమోడిన అమెరికా
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ పేలింది. నలుగురిని బలి తీసుకుంది. పలువురిని గాయపరిచింది. తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేయడానికి అక్కడి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలేవీ సరిపోవట్లేదు. రోజూ ఇలాంటి కాల్పుల ఘటనలు సంభవిస్తూనే వస్తోన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇలాంటివి 336 సంఘటనలు చోటు చేసుకున్నట్లు గన్ వయోలెన్స్ ఆర్కైవ్స్ వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే సగటున ప్రతిరోజూ అమెరికాలో రెండు చోట్ల మాస్ షూటింగ్ జరుగుతున్నట్టే.
దీన్ని నివారించడానికి అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ పలు చర్యలు తీసుకుంది. ప్రత్యేకంగా ఆయుధ నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది. 18 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారికి ఆయుధాలను విక్రయించడాన్ని నిషేధించింది. ఆటోమేటిక్ గన్స్ వినియోగంపైనా ఆంక్షలను విధించింది. అందరికీ గన్ లైసెన్స్‌ను ఇవ్వడంపై ఉక్కుపాదం మోపింది. ఇంతా చేసినప్పటికీ అమెరికాలో గన్ కల్చర్‌కు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు.

తాజాగా దక్షిణ కరోలినాలోని సెయింట్ హెలెనా ఐలండ్ లో ఉన్న విల్లీస్ బార్ అండ్ గ్రిల్ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు మరణించారు. 20 మందికి గాయాలయ్యాయి. కాల్పులు జరిగిన సమయంలో బార్‌లో వందలాది మంది ఉన్నారని బ్యూఫోర్ట్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించింది. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం వేకువజామున ఒంటిగంట సమయంలో విల్లీస్ బార్ అండ్ గ్రిల్ వద్ద కాల్పులు జరిగాయి.
సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేప్టటారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారి వివరాలను అధికారులు ఇంకా విడుదల చేయలేదు. కాల్పులకు గల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరావట్లేదని, దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని చెప్పారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
అమెరికన్ కాంగ్రెస్ రెప్రజెంటేటీవ్ నాన్సీ మేస్ ఈ ఘటనపై స్పందించారు. బ్యూఫోర్ట్ కౌంటీలో జరిగిన విధ్వంసకర కాల్పులు కలచివేశాయని అన్నారు. ఈ హింసాకాండతో ప్రభావితమైన బాధితులు, వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తోన్నానని అన్నారు. కాల్పులకు గల కారణాలను తెలుసుకోవడానికి కౌంటీ పోలీసులు దర్యాప్తు సాగిస్తోన్నారని, త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తారని అన్నారు.
దక్షిణ కరోలినా తీరంలో ఉంటుందీ సెయింట్ హెలెనా ఐలండ్. గీచీ కమ్యూనిటీల్లో ఇదీ ఒకటి. ఇక్కడ నివసించే వారందరినీ కూడా ఆఫ్రికా నుంచి వలస వచ్చినట్లుగా భావిస్తారు. ఇక్కడ ఆఫ్రికన్ సంప్రదాయాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం అరుదు.












Click it and Unblock the Notifications