ఆ యుద్ధానికి భారతే మూలకారణం- తగిన మూల్యం తప్పదు: ట్రంప్ అల్టిమేటం
హెచ్ 1బీ విసా వార్షిక ఫీజుల పెంపుతో భారత్ ను షేక్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరో అడుగు ముందుకేశారు. ఘాటు ఆరోపణలు సంధించారు.. అది కూడా ఐక్యరాజ్య సమితి వేదికగా. ఈ క్రమంలో భారత్, చైనాలను ఒకే గాటన కట్టేశారు. ఉక్రెయిన్ యుద్ధానికి ఈ రెండు దేశాలే ప్రధాన ఆర్థిక వనరులని ఆరోపించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించడమే దీనికి కారణమని తేల్చి చెప్పారు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. గంటకు పైగా ఆయన ప్రసంగం సాగింది. ఇందులో భారత్, చైనాలను పూర్తిగా లక్ష్యంగా చేసుకున్నారు. చమురు కొనుగోళ్ల ద్వారా ఈ రెండు దేశాలు రష్యాకు ఆర్థికంగా పరిపుష్టం చేశాయని, ఉక్రెయిన్ పై యుద్ధానికి కావాల్సినంత ఆర్థిక వనరులను సమకూర్చిపెట్టాయని ఆరోపించారు. ఉక్రెయిన్ పై రష్యా సుదీర్ఘకాలం పాటు యుద్ధాన్ని కొనసాగించడానికి చాలినన్ని నిధులు అందిస్తోన్నాయని అన్నారు.

నాటో సభ్య దేశాలను కూడా డొనాల్డ్ ట్రంప్ తూర్పారబట్టారు. రష్యా నుంచి చాలా వరకు ఇంధన ఉత్పత్తులను నిలిపి వేయలేదని అన్నారు. ఇది సంతోషించదగ్గ విషయం కానే కాదని అన్నారు. రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించే విషయంలో భారత్, చైనా, నాటో సభ్య దేశాలు.. పునరాలోచించుకోవాలని హెచ్చరించారు. అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయని తేల్చి చెప్పారు.
ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించడానికి రష్యా ముందుకు రాకపోతే మరిన్ని కఠినమైన టారిఫ్ లను ఎదుర్కొనాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అత్యంత కఠిన టారిఫ్ ను విధించడంలో రాజీపడబోమని అన్నారు. ఈ విషయంలో యూరోపియన్ దేశాలు కూడా తమతో కలిసి పని చేయాలని, ఇదే విధమైన టారిఫ్ ను రష్యాపై విధించాలని సూచించారు. కొన్ని యూరప్ దేశాలు.. రష్యాతో పోరాడుతూనే అక్కడి నుండి చమురు, గ్యాస్ కొనుగోలు చేయడం సరికాదని చెప్పారు.
ఆయా దేశాలన్నీ కూడా రష్యాతో వాణిజ్య సంబంధాలను తెంచుకుంటే ఎక్కువ కాలం పాటు ఆ దేశం ఉక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఎంత త్వరగా అమలులోకి వస్తే ప్రపంచ దేశాలకు అంత మంచిదని, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడం వల్ల ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వనరులను నిలిపివేస్తే యుద్ధం ఆటోమేటిక్ గా నిలిచిపోతుందని విశ్లేషించారు.












Click it and Unblock the Notifications