ఇదీ లెక్క: కచ్చితంగా డొనాల్డ్ ట్రంప్‌దే విజయం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తారని ప్రముఖ అధ్యాపకుడు ఒకరు అంచనా వేశారు. ఫలితాలను కచ్చితంగా విశ్లేషించే ఓ విధానాన్ని ఆయన అభివృద్ధి చేశారు.
దీంతో సరిచూస్తే గత వందేళ్ల ఎన్నికల ఫలితాలు దాదాపుగా సరిపోయాయి. ప్రస్తుతం డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ వర్సిటీకి చెందిన రాజకీయశాస్త్ర అధ్యాపకుడు హెల్ముట్ నోపోథ్ తాజా అంచనాలు వెలువరించారు.
ప్రాథమిక ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోయారని, ప్రధాన పోరులోనూ ఇదే పునరావృతమవుతుందని చెప్పారు. ప్రాథమిక ఎన్నికల్లో మెరుగ్గా పోరాడిన వారే, అధ్యక్ష భవనంలో అడుగుపెడతారని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

మిశ్రమ స్పందన
తాజాగా విడుదల చేసిన పోల్స్‌లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌లు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఓ పోల్ సర్వే ఇద్దరు అభ్యర్థుల మధ్య ఒక పాయింట్ కంటే తక్కువ తేడా ఉందని వెల్లడించగా, మరో పోల్ సర్వే మాత్రం ట్రంప్ కంటే హిల్లరీ 14 పాయింట్ల ముందంజలో ఉన్నారని తెలిపింది.
2012 ఎన్నికల్లో చాలా వరకు కచ్చితమైన పోల్స్‌ను వెల్లడించిన ఐబీడీ/టీఐపీపీ సర్వే ఈ ఎన్నికల్లో ట్రంప్‌నకు 41.2 శాతం ఓటర్లు మద్దతు ఉందని తెలపగా. హిల్లరీ కేవలం 0.6శాతం ఆధిక్యంతో 41.8శాతం ఓటర్ల మద్దతు సాధిస్తున్నారని తెలిపింది.
ఏపీ-జీఎఫ్‌కే పోల్ సర్వే హిల్లరీ 14శాతం పాయింట్ల తేడాతో ముందున్నారని పేర్కొంది. దీని ప్రకారం ట్రంప్‌నకు 37శాతం మద్దతు రాగా, హిల్లరీకి 51శాతం మద్దతుంది. ఏపీ-జీఎఫ్‌కే 1,546 మందిపై సర్వే చేయగా హిల్లరీ పట్ల మంచి స్పందన వచ్చిందని తెలిపింది.
ఫాక్స్ న్యూస్ పోల్‌లో హిల్లరీకి 44 శాతం మద్దతు రాగా, ట్రంప్ 41 శాతం వచ్చింది. యూఎస్ టుడే/సఫ్ఫోల్క్ యూనివర్సిటీ సర్వే ప్రకారం హిల్లరీనే తొమ్మిది పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాయిటర్స్/ఐపీఎస్‌ఓఎస్ పోల్ సర్వే ప్రకారం కూడా హిల్లరీ ట్రంప్‌పై నాలుగు పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారు. లాస్‌ఏంజిల్స్ టైమ్స్/ యూఎస్‌సీ సర్వే హిల్లరీ కంటే ట్రంప్ ఒక్క పాయింటు ముందు ఉన్నారని తెలిపింది.












Click it and Unblock the Notifications