పుతిన్ భారత్ కు వచ్చిన వేళ.. రెండు దేశాలకూ ట్రంప్ సుతిమెత్తని హెచ్చరికలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తోన్నారు. రెండు రోజుల పాటు ఆయన వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎయిర్ పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలికారు. ఇది చాలా అరుదు. ప్రధాని నేరుగా విమానాశ్రయానికి వెళ్లి అతిథిని ఆహ్వానించడం అనేది అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే చోటు చేసుకుంటుంది.
ఈ పరిణామాల మధ్య.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెర మీదికి వచ్చారు. వైట్ హౌస్ లో మాట్లాడారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించారు. ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం చాలా కష్టపడుతున్నామని అన్నారు. అయినప్పటికీ సానుకూల ఫలితాలు రావట్లేదని వ్యాఖ్యానించారు. అంతిమంగా ఓ పరిష్కారం లభిస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దిశగా తీసుకుంటోన్న చర్యలు గురించి వివరించారు.

ప్రపంచం అంతటా శాంతిని నెలకొల్పుతున్నామని, భారత్- పాకిస్తాన్ సహా ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలను ఆపామని, పలు అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించామని డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇక రష్యా-ఉక్రెయిన్ మిగిలివుందని, త్వరలోనే దీనికి అంతిమ పరిష్కారాన్ని చూపుతామని అన్నారు. ఈ యుద్ధం వల్ల అమాయకులు అకారణంగా ప్రాణాలను కోల్పోతున్నారని, అది బాధాకరమని వ్యాఖ్యానించారు.
కిందటి వారం 8,000 మంది, అంతకుముందు నెలలో 27,000 మంది సైనికులు అనవసరంగా మరణించారని, దీన్ని ఆపాల్సిన అవసరం ఉందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. మియామిలో అమెరికా, ఉక్రెయిన్ అధికారులు తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారని ట్రంప్ గుర్తు చేశారు. ట్రంప్ అంబాసిడర్ స్టీవ్ విట్‌కాఫ్, అల్లుడు జేర్డ్ కుష్నర్.. వ్లాదిమిర్ పుతిన్‌తో సుమారు అయిదు గంటల పాటు జరిగిన సమావేశం కొలిక్కి రాలేదు.
ఈ సమావేశంపై పుతిన్ విమర్శలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిగా వొలొదిమిర్ జెలెన్ స్కీ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు అనుగుణంగా పని చేస్తోన్నాడని, శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ప్రయత్నిస్తానని వాగ్దానం చేసినప్పటికీ దాన్ని విస్మరించారని ఆరోపించారు. జెలెన్ స్కీ సంకుచిత జాతీయవాదం శాంతికి విఘాతం కలిగించేదిలా ఉందని పేర్కొన్నారు. అర్ధాంతరంగా ముగిసిన ఈ చర్చలు మళ్లీ ప్రారంభం అయ్యాయా లేదా అనేదానిపై వైట్‌హౌస్ స్పందించలేదు.












Click it and Unblock the Notifications