ఇరాన్ కు ట్రంప్ మరోసారి వార్నింగ్.. హార్మూజ్ జలసంధిలో సీ మైన్స్ పెడితే..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన సీ మైన్లను నాశనం చేశామని.. వాటిని డిటోనేట్ చేశామని స్పష్టం చేశారు. ప్రపంచదేశాలకు వ్యూహాత్మకంగా ఉన్న హార్మూజ్ జలసంధిలో ఇప్పటి వరకూ ఉన్న అన్ని సీ మైన్స్ ను నాశనం చేశామని తెలిపారు. ఇరాన్ ఇకపై కొత్తగా సీ మైన్స్ అమర్చొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామని.. వాటిని అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ మరోసారి కీలక వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ విషయంలో ఇరాన్ చర్యలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
BREAKING: Trump warns Iran of 'zero tolerance' on placing mines in Strait of Hormuz as Navy reports international waters are clear pic.twitter.com/REZRtMJ71J
— Fox News (@FoxNews) August 25, 2026
ఈ మేరకు ట్రంప్ తన అధికారిక సామాజిక మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ లో ఈ విషయాల్ని పోస్టు చేశారు. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన సీ మైన్స్ అన్నింటినీ ధ్వంసం చేసినట్లు అమెరికా నేవీ తనకు తెలిపిందని అన్నారు. కొత్తగా ఏమైనా పెట్టినా వాటిని కూడా నాశనం చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిలోని ప్రతి ఇంచును అమెరికా క్షుణ్ణంగా పరిశీలిస్తోందని అన్నారు. పికాక్సే మౌంటెన్ పైనా అమెరికా నేవీ.. స్పేస్ ఫోర్స్ ద్వారా నిఘా పెట్టిందని అన్నారు. పికాక్సే మౌంటెన్ ను కుహ్- ఈ- కోలాంగ్ గజ్ లా అని కూడా పిలుస్తుంటారు. ఇది ఇరాన్ కు చెందిన నిర్మాణంలో ఉన్న న్యూక్లియర్ సైట్.. అయితే ఇప్పటికే ఇరాన్ కు చెందిన మూడు న్యూక్లియర్ సైట్స్ ను ధ్వంసం చేశామని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ప్రపంచ దేశాలకు వాణిజ్యంగా కీలకంగా మారిన హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరోవైపు ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని అమెరికా చూస్తోంది. ఇందులో భాగంగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఇరాన్ పై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ప్రకటించారు. ఆపరేషన్ ఎకనామిక్ అవుట్ కాస్ట్ అనే పేరుతో ఈ కొత్త ఆంక్షల ప్యాకేజీని తీసుకొచ్చారు. ఇరాన్ ఆర్థిక మూలాలను పూర్తిగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. కీలక రంగాలైన డిజిటల్ ఆస్తులు, టెక్నాలజీ, బంగారం, విమానయానం, నౌకా రవాణా తదితర వాటిని ఈ ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చారు. అలాగే ఇరాన్ తో వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలు, సంస్థలపైనా ద్వితీయ స్థాయి ఆంక్షలు విధించే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications