వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఓపీ సేవలు - దసరా డెడ్ లైన్ పెట్టిన సీఎంఓ!
వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు ఆలస్యం కావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే పూర్తి కావాల్సిన పనులకు మరిన్ని గడువులు కోరడం పై కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులు, రోడ్లు భవనాల శాఖ అధికారులను ప్రశ్నించారు. వారు ఇచ్చిన వివరణలు సీఎంవో అధికారులకు సంతృప్తి కలిగించలేదు.
ఇటీవల వరంగల్‌కు వచ్చిన సీఎంవో బృందం ఆస్పత్రి నిర్మాణ స్థలాన్ని నేరుగా పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించింది. ప్రస్తుతం కేవలం నాలుగు అంతస్తులు మాత్రమే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని గుర్తించి, దసరా పండుగ నాటికి మరో నాలుగు అంతస్తుల పనులు పూర్తి చేసి ఔట్ పేషెంట్ సేవలు ప్రారంభించాలని స్పష్టమైన లక్ష్యం నిర్దేశించారు.పనుల వేగం పెంచేందుకు కార్మికుల సంఖ్యను పెంచాలని, అవసరమైతే రాత్రింబవళ్లు 24 గంటలూ పనులు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.

నిర్మాణంతో పాటు యంత్రాల ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్లు, ఇతర సాంకేతిక పనులు కూడా ఒకేసారి పూర్తి చేయాలని చెప్పారు. ఎంజీఎం ఆస్పత్రి భవనం పాతబడి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో కొత్త ఆస్పత్రిని త్వరగా ప్రారంభించాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ మొదటి వారంలో వరంగల్ పర్యటనకు రావాల్సి ఉండగా, షెడ్యూల్ మారి దసరా తర్వాతకు వాయిదా పడింది.
ఈ కారణంగా సీఎం రాకముందే ఆస్పత్రి పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించాలని అధికారులు భావిస్తున్నారు. వైద్య విభాగాల ప్రకారం ఏ అంతస్తులో ఏ సేవలు అందించాలనే ప్రణాళిక ఇప్పటికే సిద్ధమైంది. మొదట ఓపీ సేవలు ప్రారంభించి, తర్వాత పూర్తి స్థాయి వైద్య సేవలను కొత్త భవనానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే వరంగల్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది. అయితే దసరా నాటికి ఓపీ సేవలు ప్రారంభం కావాలంటే నిర్మాణ, సాంకేతిక పనులు వేగంగా జరగటం కీలకం. దీంతో సీఎంఓ అధికారుల ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.













Click it and Unblock the Notifications
