H1B Visa.. లక్ష డాలర్లే: కొంప ముంచావు కదయ్యా..!!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. ఆటంబాంబు కంటే తక్కువేమీ కాదిది. H-1B వీసాలపై ఏటా 1,00,000 డాలర్ల ఫీజును విధించే కొత్త విధానాన్ని ప్రకటించారు. ఇది- భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే- హెచ్ 1బీ విసాలను పొందే వారిలో అత్యధిక శాతం భారతీయులే ఉన్నారు. ఈ నిర్ణయం హెచ్-1బీ వీసాల చరిత్రలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న అతిపెద్ద సవరణల్లో ఒకటి.
విసాల ఫీజు లక్ష డాలర్లకు పెంచడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి వీసాకు ఆయా కంపెనీలు ఏటా లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. హెచ్-1B వీసాల కోసం ఏటా లక్ష డాలర్లను చెల్లించడానికి దాదాపుగా అన్ని పెద్ద కంపెనీలు అంగీకరించాయని, ఇదివరకే తాము ఆయా కంపెనీల యజమానులతో మాట్లాడామని అని లుట్నిక్ పేర్కొన్నారు.

ఈ కొత్త విధానం అమెరికా గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యత ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుందని లుట్నిక్ వివరించారు. వారికి టెక్ రంగంలో మరింత మెరుగైన శిక్షణ ఇవ్వడానికి ఇది సహాయపడుతుందని వ్యాఖ్యానించారు. అమెరికన్ గ్రాడ్యుయేట్లకు దక్కాల్సిన ఉద్యోగాలను లాక్కోవడానికి ఇతర దేశాలకు చెందిన నిపుణులను ఇక్కడికి తరలించడాన్ని ఆపాలని సూచించారు. ఈ క్రమంలోనే హెచ్ 1బీ విసా ఫీజును లక్ష డాలర్లకు పెంచినట్లు వివరించారు.
ఫీజు పెంపుపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఈ నిర్ణయాన్ని టెక్నాలజీ రంగం స్వాగతిస్తుందని, కొత్త వీసా ఫీజుతో ఆయా కంపెనీల యజమానులు చాలా సంతోషంగా ఉంటారని వ్యాఖ్యానించారు. టెక్ కంపెనీలు ఈ ఫీజుల పెంపును ఇష్టపడుతున్నాయని పేర్కొ.న్నారు ట్రంప్. ఇది అవసరమనీ చెప్పారు. దీనిపై ఇప్పటివరకు అమెజాన్, ఆపిల్, గూగుల్, మెటా వంటి అతిపెద్ద టెక్ కంపెనీలు స్పందించలేదు.
1990లో ప్రారంభమైన హెచ్ 1బీ విసాల ప్రక్రియలో చోటు చేసుకున్న అతి కీలక మార్పుగా దీన్ని అభివర్ణిస్తోన్నాయి భారత టెక్ కంపెనీలు. ప్రస్తుతం.. H-1B దరఖాస్తుదారులు లాటరీ కోసం తక్కువ ఫీజును చెల్లిస్తోన్నారు. ఎంపికైతే.. దాని అవసరాలను బట్టి కొన్ని వేల డాలర్ల వరకు అదనపు డాలర్లను కట్టాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ వీసా ఖర్చులను ఆయా కంపెనీల యజమానులే భరిస్తారు.
ఈ వీసా పొందిన వారిలో 71 శాతం మంది భారతీయులే ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనీయులు 11.7 శాతం మంది ఉన్నారు. హెచ్-1బీ వీసాలు సాధారణంగా మూడు నుండి ఆరు సంవత్సరాల కాలానికి మంజూరవుతాయి. ఏటా లాటరీ సిస్టమ్ ద్వారా 85,000 వీసాలను జారీ చేస్తుంది అమెరికా. ఈ సంవత్సరం, అమెజాన్‌కు అత్యధికంగా 10,000 ఈ విసాలు లభించాయి. ఆ తర్వాతి స్థానాల్లో టాటా కన్సల్టెన్సీ, మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ ఉన్నాయి.












Click it and Unblock the Notifications