‘మిస్సైల్స్ వదలబోతున్నా’.. ట్రంప్ చేష్టలతో జర్నలిస్టులు షాక్! (వీడియో)
Donald Trump: ప్రపంచ రాజకీయాల్లో నిత్యం చర్చనీయాంశంగా ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆయన వైట్‌హౌస్ పైకప్పుపై నిలబడి అసాధారణమైన సంకేతాలు ఇస్తూ కనిపించారు. కింద ఉన్న జర్నలిస్టులు ఆయనను ప్రశ్నించగా.. ట్రంప్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ట్రంప్ విచిత్రమైన చేష్టలు.. జర్నలిస్టుల ప్రశ్న
డొనాల్డ్ ట్రంప్ తన వివాదాస్పద విదేశాంగ విధానాలు, సుంకాల యుద్ధం, సైనిక వ్యూహాల వల్ల ప్రపంచవ్యాప్తంగా నిత్యం వార్తల్లో ఉంటారు. అయితే ప్రస్తుతం ఆయన వైట్‌హౌస్ పైకప్పుపై నుంచి చేసిన చేష్టలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి. సాధారణంగా కట్టుదిట్టమైన భద్రత మధ్య కార్లు, విమానాలలో కనిపించే ట్రంప్.. ఈ సారి బహిరంగంగా వైట్‌హౌస్ పైకప్పు మీద కనిపించారు. ఆయన వెంట భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ.. ఆయన చేసిన విచిత్రమైన సంకేతాలు కింద ఉన్న జర్నలిస్టుల దృష్టిని ఆకర్షించాయి. జర్నలిస్టులు ఆయనను పైకప్పుపై ఏం చేస్తున్నారని ప్రశ్నించగా.. ఆయన ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రంప్ ఇలా సరదాగా వ్యాఖ్యలు చేయడం అరుదు.

"మిస్సైల్స్ వదలబోతున్నా".. దెబ్బకు జర్నలిస్టులు షాక్
మంగళవారం డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా వైట్‌హౌస్ పైకప్పు కనిపించడంతో జర్నలిస్టులు ఆశ్చర్యానికి గురయ్యారు. కింద నుంచి జర్నలిస్టులు "సర్, మీరు పైకప్పుపై ఏం చేస్తున్నారు?" అని అడగగా.. ట్రంప్ పైనుంచి ఏదో బిగ్గరగా అరిచారు. జర్నలిస్టులు "మీరు మిస్సైల్స్ అంటున్నారా?" అని తిరిగి ప్రశ్నించగా, ట్రంప్ చేతితో సరదాగా సైగ చేస్తూ "మిస్సైల్స్ వదిలేందుకు సిద్ధమవుతున్నాను" అని బదులిచ్చారు. నిజానికి, ట్రంప్ అక్కడ వైట్‌హౌస్‌లో జరుగుతున్న నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆ సమయంలో ఆయన వెంట భద్రతా సిబ్బంది, కొంతమంది ఆర్కిటెక్టులు ఉన్నారు. సుమారు 20 నిమిషాల పాటు ట్రంప్ పైకప్పుపై ఉండి, కింద ఉన్న జర్నలిస్టుల వైపు చేతులు ఊపారు.
🚨 LMAO! “Mr. President! What are you looking to build?!”
— Nick Sortor (@nicksortor) August 5, 2025
“NUCLEAR MISSILES!”
*missile hand motion* 🤣
I freaking love Rooftop Trump
pic.twitter.com/gJzxfGGN2v
అమెరికా-రష్యా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
ఈ సంఘటన అమెరికా-రష్యా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ రష్యా సరిహద్దుల సమీపంలో రెండు అణు జలాంతర్గాములను మోహరించారు. దీనికి ప్రతిగా రష్యా అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వదేవ్, ట్రంప్ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం కూడా చర్చనీయాంశమైంది. అయితే, ప్రస్తుతం అమెరికా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి మాస్కోకు చేరుకోనున్నారు.












Click it and Unblock the Notifications