తుర్కియే భూకంపం: కూలిన భవనాలు... షాపింగ్ మాల్... ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం

తుర్కియేలో సోమవారం తెల్లవారుజామున రెండు భూకంపాలు సంభవించాయి.
సిరియా సరిహద్దులోని గాజియంటెప్ సమీపంలో మొదటి భూకంపం సంభవించిందని అమెరికన్ జియోలాజిలక్ సర్వే (యూఎస్‌జీఎస్) ప్రకటించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.8గా నమోదైందని తెలిపింది.
15 నిమిషాల తర్వాత సెంట్రల్ తుర్కియేలో రెండో భూకంపం సంభవించింది. రాజధాని అంకారాతోపాటు లెబనాన్, సిరియా, సైప్రస్‌లలో కూడా భూమి కంపించింది.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4.17 గంటలకు మొదటి భూకంపం చోటుచేసుకుందని వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది .
భూకంపం నేపథ్యంలో తుర్కియేలో ఎమర్జెన్సీని ప్రకటించారు.
తుర్కియేలో భారీగా భవనాలు కూలిపోవడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు బీబీసీ తుర్కియే ప్రతినిధులు తెలిపారు.
తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించినట్లు తుర్కియే అధ్యక్షుడు ఎర్దోవాన్ ప్రకటించారు.
భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక చర్యల బృందాలను పంపినట్లు ఆయన తెలిపారు.

తొలుత సిరియా సరిహద్దులో
తుర్కియే తూర్పున 26 కి.మీ దూరంలో ఉన్న నూర్దా నగరంలో గాజియంటెప్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
7.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ జియోసైన్సెస్ (జీఎఫ్‌జెడ్) ప్రకటించిందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
జీఎఫ్‌జెడ్ ప్రకారం భూకంపం కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉంది. అదే సమయంలో భూకంప కేంద్రం భూమికి 11 మైళ్ల దిగువన ఉందని యూఎస్‌జీఎస్ తెలిపింది.
ఇది జరిగిన కొద్దిసేపటికే సెంట్రల్ తుర్కియేలో రెండోసారి భూమి కంపించింది.
దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.7గా నమోదైందని యూఎస్‌జీఎస్ వెల్లడించింది. దీని కేంద్రం భూమికి 9.9 కిలోమీటర్ల దిగువన ఉన్నట్లు తెలిపింది.
భూకంపం కారణంగా చాలా భవనాలు కూలిపోయాయని, ప్రజలు వాటి శిథిలాలలో చిక్కుకుపోయి ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి.
ప్రకంపనల కారణంగా నగరంలోని ఓ షాపింగ్ మాల్ నేలమట్టమైందని దియార్‌బాకిర్‌లోని బీబీసీ తుర్కియే ప్రతినిధి తెలిపారు.
గాజాలో 45 సెకన్ల పాటు భూమి కంపించిందని అక్కడి బీబీసీ ప్రతినిధి రష్దీ అబులాలుఫ్ అన్నారు.
ప్రపంచంలో ఎక్కువగా భూకంపాలు వచ్చే జోన్‌లో తుర్కియే ఉంది. గతంలోనూ ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగాయి. 1999లో 7.4 తీవ్రతతో వచ్చిన భూకంపంలో సుమారు 17వేల మంది చనిపోయారు.












Click it and Unblock the Notifications