ఆర్బిటల్ స్టేషన్ బయట స్పేస్ వాక్: తొలిసారి చేసిన చైనా వ్యోమగాములు
ఇద్దరు చైనా వ్యోమగాములు తొలిసారి తమ దేశ కొత్త ఆర్బిటల్ స్టేషన్ బయట స్పేస్ వాక్ చేశారు. 15 మీటర్ల పొడవైన రోబోటిక్ చేతిని అమర్చేందుకు వారు బయట నడవడం విశేషం. ల్యూ బూమింగ్, టాంగ్ హాంగ్ బో అనే వీరు బయట నడుస్తుండగా కక్ష్య లోపల కమాండర్ నీ హైషింగ్ వీరి కదలికలను పర్యవేక్షించారు. మూడు నెలల మిషన్‌కి గాను ఈ ముగ్గురు ఆస్ట్రోనట్స్ గత జూన్ 17వ తేదీన అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు.
కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని చైనా స్పేస్ ప్రోగ్రామ్ చేపట్టింది. కొద్దిసేపు శ్రమించిన తర్వాత స్పేస్ వాక్ చేసిన వ్యోమగాములు రోబోటిక్ చేతిని సరిగ్గా అమర్చగలిగారు. రోబోటిక్ ఆర్మ్.. ఆర్బిటల్ స్టేషన్ భాగాలను ఒకటిగా చేయడానికి ఉపయోగపడుతుంది. అవసరమైతే సుమారు 6 గంటలవరకు వాక్ చేయడానికి అనువుగా వీరి సూట్లను డిజైన్ చేశారని సమాచారం. షేంజూ క్యాప్స్యూల్‌లో ఈ వ్యోమగాముల మిషన్ సాగింది.

వచ్చే ఏడాది 70 టన్నుల ఆర్బిటల్ స్టేషన్‌కి మరో రెండు మోడ్యూల్స్ ని కలిపేందుకు చైనా స్పేస్ ఏజెన్సీ మొత్తం 11 ప్రయోగాలను చేపట్టాలని ప్రతిపాదించింది. ఇప్పటికే అంతరిక్ష ప్రయోగాలపై చైనా అభివృద్ధి పథంలో సాగుతుండగా అమెరికా మాత్రం విమర్శిస్తోంది. చైనా ప్రయోగాలను అంతరిక్షంలో కూడా తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి చేపడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. డ్రాగన్ కంట్రీ మాత్రం ఎడారుల్లో ఏర్పాటు చేసిన అంతరిక్ష ప్రయోగ కేంద్రాల ద్వారా ఈ విధమైన మిషన్‌లను కామ్ గా చేసుకునిపోతోంది.












Click it and Unblock the Notifications