భారత్ పై సుంకాల వేళ.. పాకిస్థాన్ కు అమెరికా భారీ సాయం..
భారత్ తో టారిఫ్ వార్ నేపథ్యంలో పాకిస్థాన్ కు అమెరికా భారీ సాయం చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్ వస్తువులపై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. పాకిస్థాన్ కు మాత్రం ఆపన్న హస్తం అందిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా పాకిస్థాన్ లో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వరద బాధితులను ఆదుకునేందుకు అమెరికా ముందుకొచ్చింది. పాకిస్థాన్ లో వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అమెరికాకు చెందిన ఆర్మీ సెంట్రల్ కమాండ్ సాయం అందించింది.
తాజాగా పాకిస్థాన్ కు ఆరు పెద్ద పెద్ద ట్రక్కుల్లో వివిధ నిత్యావసరాలను పాకిస్థాన్ కు చేరవేసింది. అందులో టెంట్లు, నీటిని తోడే పంప్స్, జెనరేటర్లు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించి మొదటి కన్ సైన్ మెంట్ శనివారం పాకిస్థాన్ కు చేరుకోగా నిత్యావసరాలను పాకిస్థాన్ ఆర్మీకి అందజేసింది అమెరికాకు చెందిన ఆర్మీ సెంట్రల్ కమాండ్. ఈ నిత్యావసరాలను ఆర్మీ ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్స్ కు తరలించి ప్రజలను అందించనున్నారు. అయితే అమెరికా ఆపన్నహస్తంపై పాకిస్థాన్ ప్రభుత్వం, అక్కడి ప్రజలు అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు.
🚨BREAKING: US delivers flood aid to Pakistan — six ARCENT flights with tents, pumps & generators handed to Pak Army. Islamabad thanks Washington for the support. pic.twitter.com/AtVdwlkPmr
— The Daily CPEC (@TheDailyCPEC) September 6, 2025
పాకిస్థాన్ ను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా పాకిస్థాన్ లోని ఉత్తరాది రాష్ట్రాల్లోని నదులు ఉప్పొంగాయి. అధిక వర్షాల కారణంగా, ప్రధాన ఆనకట్టల గేట్లు తెరిచి అదనపు నీటిని విడుదల చేశారు అధికారులు. వరదల కారణంగా తావి నదిలో వరదలు రావచ్చని భారత ప్రభుత్వం పాకిస్థాన్ కు హెచ్చరికలు జారీ చేసింది. మానవతా దృష్టితో ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది. అయితే పాకిస్థాన్ మాత్రం ఈ విషయంలోనూ రాజకీయాలు చేసింది. భారత్ నీటిని ఓ ఆయుధంగా మార్చుకుంటోందని పాకిస్థాన్ ను ముంచేయాలని ప్లాన్ చేస్తోందని మండిపడుతోంది.
మరోవైపు ట్రంప్ నిర్ణయాలపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపేస్తానని ప్రకటించిన ట్రంప్ వ్యాఖ్యలను రష్యా తిప్పికొట్టింది. దీంతో రష్యాపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ ఇటీవల తెలిపారు. అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్ పై దాడులను మరింత తీవ్రతరం చేసింది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ తో శాంతి చర్చలు ప్రాక్టికల్ గా అసాధ్యం అని తేల్చి చెప్పారు.

దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలని భావించిన ట్రంప్.. రష్యా నుంచి అధిక మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారత్ పై కఠిన చర్యలు తీసుకున్నారు. భారత్ వస్తువులపై ఏకంగా 50 శాతం టారిఫ్ లు విధించారు. ఆగస్టు 27 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వచ్చాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్ నుంచి అగ్రరాజ్యానికి ఎగుమతయ్యే 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ఇది ప్రభావం చూపనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో భారత్- అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సుంకాల యుద్ధం నడుస్తోంది.












Click it and Unblock the Notifications