బ్రిటన్‌లో సునామీ: 14 ఏళ్ల పాలనకు చెక్: రిషి సునాక్ అవుట్?
UK elections Results 2024: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ భారీ ఓటమి దిశగా సాగుతోంది. 14 సంవత్సరాల కన్జర్వేటివ్‌ల అధికారానికి చెక్ పడింది. ప్రతిపక్ష లేబర్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయ కేతనాన్ని ఎగురవేస్తోంది. ఈ ఎన్నికల్లో సునామీని సృష్టించింది. రికార్డుస్థాయిలో పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటోంది.
650 సీట్లు ఉన్న బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 326. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలోనే లేబర్ పార్టీ పూర్తి మెజారిటీని అందుకుంది. 329 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఇంకా 72 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

భారతీయ మూలాలు ఉన్న ప్రధానమంత్రి రిషి సునాక్ సారథ్యంలో మొన్నటివరకు అధికారంలో కొనసాగిన కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూడబోతోంది. ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థులు 74 స్థానాల్లో మాత్రమే గెలిచారు. మరో 50 చోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. 2019 నాటి ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి దక్కిన సీట్ల సంఖ్య 344.
సండర్‌ల్యాండ్ సౌత్‌లో తొలి విజయాన్ని అందుకుంది లేబర్ పార్టీ. ఆ పార్టీ అభ్యర్థి సర్ కీర్ స్టార్మర్ ఇక్కడి నుంచి ఘన విజయం సాధించారు. లేబర్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఆయనే. పూర్తి మెజారిటీతో లేబర్ పార్టీ అధికారంలో వస్తే స్టార్మర్.. ప్రధాని అవుతారు. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ లేబర్ పార్టీ ఆధిక్యత మరింత పెరగడం కనిపించింది.
ప్రధానమంత్రి రిషి సునాక్.. ఈ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. లేబర్ పార్టీకి అభినందనలు తెలియజేశారు. కీర్ స్టార్మర్‌కు ఫోన్ చేసి విషెస్ చెప్పారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. యునైటెడ్ కింగ్‌డమ్ వంటి అతిపెద్ద దేశానికి ప్రధానిగా పని చేసే అవకాశాన్ని ఇన్నాళ్లు ప్రజలు కల్పించారని, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తోన్నానని చెప్పారు.
ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి తానే నైతిక బాధత్యను తీసుకుంటోన్నట్లు రిషి సునాక్ చెప్పారు. అధికార మార్పిడి సజావుగా సాగుతుందని వ్యాఖ్యానించారాయన. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవిశ్రాంత కృషి చేశామని, అంకితభావంతో పాలన సాగించామని పేర్కొన్నారు. తమ పార్టీ అభ్యర్థులు రేయింబవళ్లు శ్రమించారని, ప్రజల తీర్పు బాధాకరమే అయినప్పటికీ అంగీకరిస్తున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications