వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుక్రెయిన్ సంక్షోభం: పుతిన్ క్రిమియాను రష్యాలో ఎలా విలీనం చేశారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వ్లాదిమిర్ పుతిన్

రిపబ్లిక్ ఆఫ్ క్రిమియా అధికారికంగా యుక్రెయిన్‌లో అంతర్భాగం. యుక్రెయిన్ పీఠభూమికి దక్షిణాన అజోవ్, నల్ల సముద్రాలకు మధ్యన ఇది ఉంటుంది.

క్రిమియాకు తూర్పు వైపున కెర్చ్ జల సంధి ఉంటుంది. దీన్ని దాటితే రష్యా వస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత 2014లో తూర్పు-పశ్చిమ దేశాల వివాదానికి క్రిమియా కేంద్రబిందువైంది.

యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో విధ్వంసకర నిరసనల నడుమ రష్యా మద్దతున్న యుక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో యుక్రెయిన్‌లో అంతర్భాగమైన క్రిమియా పీఠభూమిని రష్యా సైన్యం తమ నియంత్రణలోకి తీసుకుంది.

క్రిమియాలో రష్యన్ భాష మాట్లాడే ప్రజలదే ఆధిక్యం. వీరు ప్రజాభిప్రాయ సేకరణలో రష్యాతో కలిసేందుకు మొగ్గుచూపారు. అయితే, క్రిమియాను రష్యా తమ భూభాగంలో కలిపేసుకోవడాన్ని చట్టవ్యతిరేకమైన చర్యగా యుక్రెయిన్, పశ్చిమ దేశాలు పరిగణిస్తున్నాయి.

యుక్రెయిన్

క్రిమియా చరిత్ర

1783లో క్యాథరీన్ ద గ్రేట్ పాలనలో రష్యా సామ్రాజ్యంలో క్రిమియా విలీనమైంది. 1954 వరకు దాదాపుగా ఇది రష్యాలో భాగంగా ఉంది. ఆ తర్వాత సోవియట్ పాలకుడు నికిత ఖ్రుస్చేవ్ దీన్ని యుక్రెయిన్‌కు అప్పగించారు.

క్రిమియాలో రష్యన్ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉంటారు. అయితే, ఇక్కడ యుక్రెయిన్‌తోపాటు క్రిమియా తాతార్ జాతుల (తుర్కుల సంతతికి చెందినవారు) ప్రజలు కూడా ఉంటారు. శతాబ్దాల గ్రీకు, రోమన్ పాలన ప్రభావంతో 1443లో ఇక్కడ తాతార్ సామ్రాజ్యం ఏర్పడింది. ఆ తర్వాతి కాలంలో ఇది ఒట్టోమన్ సామ్రాజ్యంలో విలీనమైంది.

19వ శతాబ్దంలో ఇక్కడ క్రిమియా యుద్ధం జరిగింది. 1854లో జరిగిన ఈ యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్, ఒట్టోమన్ సామ్రాజ్యం కలిసి రష్యాను ఓడించాయి. ఆ తర్వాతి బోల్షివిక్ విప్లవం ద్వారా రష్యాలో క్రిమియాకు స్వయం ప్రతిపత్తి లభించింది. 1940ల్లో క్రిమియాను కొంతకాలంపాటు నాజీలు ఆక్రమించారు.

అయితే, తాతార్లు జర్మన్లతో చేతులు కలిపారని సోవియట్ పాలకుడైన స్టాలిన్ ఆరోపించారు. 1944లో పెద్దయెత్తున తాతార్లను మధ్య ఆసియా, సైబీరియాలవైపు ఆయన తరిమికొట్టారు. వీరిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత వీరిలో చాలా మంది వెనక్కి తిరిగివచ్చారు. 1990లనాటికి అలా వెనక్కి తిరిగి వచ్చినవారు 2.5 మిలియన్ల వరకు ఉంటారని అంచనా. మరోవైపు అప్పటికే యుక్రెయిన్‌లో నిరుద్యోగం, పేదరికం భారీగా ఉండేది. నిరంతరం క్రిమియన్ తాతార్లు, ఇతర జాతుల మధ్య భూవివాదాలు జరిగేవి.

క్రిమియా

నాజీల ఆక్రమణతో..

రష్యా సామ్రాజ్యం కుప్పకూలిన తర్వాత, 1917లో యుక్రెయిన్‌లో ''కేంద్ర రాదా పరిషత్’’ ఏర్పడింది. 1918లో యుక్రెయిన్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. అయితే, తర్వాత ఇక్కడ అంతర్యుద్ధం చెలరేగింది.

దీంతో రష్యాకు చెందిన రెడ్ ఆర్మీ యుక్రెయిన్‌లో మూడింట రెండొంతుల భూభాగాన్ని ఆక్రమించింది. 1921లో అలా ఇక్కడ యుక్రెయిన్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ ఏర్పాటైంది. యుక్రెయిన్‌లోని మిగతా భాగాలు పోలాండ్‌లో కలిశాయి.

1920ల్లో యుక్రెయిన్ సంస్కృతి, భాషను సోవియట్ ప్రభుత్వం ప్రోత్సహించింది. కానీ ఆ తర్వాత మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి.

1939లో నాజీ-సోవియట్ ఒప్పందంలో భాగంగా పోలండ్‌లో భాగమైన మిగిలిన యుక్రెయిన్‌ను కూడా రష్యా ఆక్రమించింది.

కానీ 1941లో యుక్రెయిన్‌ను నాజీలు ఆక్రమించడంతో పరిస్థితులు మారాయి. 1944 వరకు యుక్రెయిన్ నాజీల పాలన కిందే ఉంది. నాజీలతో పోరాడి యుక్రెయిన్‌లో దాదాపు 50 లక్షల మంది మరణించారు. వీరిలో దాదాపు 15 లక్షల మంది యూదులు కూడా ఉన్నారు.

వ్లాదిమిర్ పుతిన్

యుద్ధం తర్వాత..

యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు మొదలయ్యాయి.

1954లో ఒక్కసారిగా సోవియట్ పాలకుడు నికిత ఖ్రుస్చేవ్.. క్రిమియా పీఠభూమిని యుక్రెయిన్‌కు అప్పగించారు.

యుక్రెయిన్ వేర్పాటువాద నాయకుణ్ని పట్టుకోవడంతో అక్కడ వేర్పాటువాద పోరాటాలు కూడా తగ్గిపోయాయి.

మళ్లీ 1960ల్లో యుక్రెయిన్‌లో సోవియట్ పాలనపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతూ వచ్చింది. 1972లో సోవియట్ వ్యతిరేక నాయకులపై చర్యలతో ప్రజల్లో ఆగ్రహం పెరిగింది.

1991లో మాస్కోలో ఓ తిరుగుబాటు జరిగింది. దీంతో యుక్రెయిన్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.

1990ల్లో దాదాపు లక్షల మంది క్రిమియన్ తాతార్లు మళ్లీ వెనక్కి తిరిగి వచ్చేశారు. వీరంతా స్టాలిన్ కాలంలో మధ్య ఆసియా, సైబీరియాలవైపు వెళ్లిపోయినవారు.

1994లో యుక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో లియోనిడ్ క్రావ్‌చుక్‌పై లియోనిడ్ కచ్మా గెలిచారు. ఆయన పశ్చిమ దేశాలు, రష్యాల మధ్య సమతూకం పాటించేవారు.

1996లో యుక్రెయిన్ కొత్త ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఆమోదించింది. 2002లో జరిగిన ఎన్నికల్లో ఎవరికీ ఆధిక్యం రాలేదు. అయితే, అన్ని పార్టీలు కలిసి కచ్మానే మళ్లీ అధ్యక్షుడిగా ప్రతిపాదించాయి.

అదే ఏడాది మే నెలలో నాటోలో చేరే ప్రక్రియలు మొదలుపెడుతున్నట్లు యుక్రెయిన్ ప్రకటించింది. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.

యుక్రెయిన్

రష్యా మద్దతున్న అధ్యక్షుడు

ఫిబ్రవరి 2010లో జరిగిన యుక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో రష్యా మద్దతున్న విక్టర్ యనుకోవిచ్ విజయం సాధించారు.

అదే ఏడాది జూన్‌లో నాటోలో చేరే ప్రణాళికలకు వ్యతిరేకంగా యుక్రెయిన్ పార్లమెంటు తీర్మానాన్ని ఆమోదించింది. నవంబరు 2013లో యూరోపియన్ యూనియన్‌లో చేరే ప్రక్రియల నుంచి కూడా యుక్రెయిన్ వెనక్కి వచ్చేసింది.

దీనికి వ్యతిరేకంగా వేల మంది వీధుల్లో నిరసనలు చేపట్టారు. ఫిబ్రవరి 2014లో దాదాపు 77 మంది నిరసనకారులను భద్రతా బలగాలు కాల్చిచంపాయి. ఆ తర్వాత విక్టర్ రష్యాకు పరారయ్యారు. దీంతో విపక్షం అధికారంలోకి వచ్చింది.

వ్లాదిమిర్ పుతిన్

2014 ఆక్రమణ

ఏప్రిల్ 2014లో రష్యా మద్దతున్న కొన్ని సాయుధ బృందాలు రష్యా సరిహద్దుల్లోని క్రిమియా ప్రాంతాలను ఆక్రమించాయి. మే నెలలో పశ్చిమ దేశాల మద్దతున్న పెత్రా పోరోషెంకో యుక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు.

అదే సమయంలో తూర్పు యుక్రెయిన్‌లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత 2014 అక్టోబరులో జరిగిన ఎన్నికల్లో పశ్చిమ దేశాల మద్దతున్న అధ్యక్షుడు గెలిచారు.

2016నాటికి యుక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ మళ్లీ క్రమంగా గాడిన పడుతూ వచ్చింది. జులై 2017లో ఐరోపా యూనియన్‌లో చేరేందుకు ఒప్పందం కూడా కుదర్చుకుంది. సెప్టెంబరు 1న ఐరోపా యూనియన్‌తో అధికారికంగా సంబంధాలను ఏర్పాటుచేసుకుంది.

మే 2018లో రష్యా, క్రిమియాలను కలిపే వంతెనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రారంభించారు. ఇది అక్రమం అంటూ యుక్రెయిన్ ప్రకటన కూడా విడుదల చేసింది. ఆ తర్వాత రెండు దేశాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు.

మళ్లీ తాజాగా సరిహద్దుల్లో రష్యా, యుక్రెయన్ దళాలు ఢీఅంటేఢీ అని ఎదురెదురు పడుతున్నాయి.

క్రిమియాలో ప్రజాభిప్రాయ సేకరణ జరగడానికి (2014 మార్చి 18కి) వారం రోజుల ముందే క్రిమియాను తమ భూభాగంలో కలిపేసుకున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మార్చి 9, 2015న తొలిసారిగా అంగీరించారు.

క్రిమియాను రష్యాలో కలిపివేసే ప్రక్రియలు ఫిబ్రవరి 22నే మొదలయ్యాయని ఓ టీవీ ఇంటర్వ్యూలో పుతిన్ వెల్లడించారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టామని, 80 శాతం మంది రష్యాలో కలిసేందుకే మొగ్గు చూపారని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ukraine crisis:How did Putin merge cremea into Russia
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X