తటస్థంగా ఉంటామంటే కుదరదు: భారత్‌కూ ఉక్రెయిన్ అధ్యక్షుడి చురక: రష్యాకు భారీగా ప్రాణనష్టం
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టేశాయి రష్యా సైనిక బలగాలు. రాకెట్లతో విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోన్నాయి. సుమీ, ఖార్‌కీవ్ నగరాల్లో పెద్ద ఎత్తున దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకుంటోన్నాయి. ఖార్‌కీవ్‌ను సొంతం చేసుకున్నట్లుగా రష్యా సైన్యం ప్రకటించింది. సుమీని కైవసం చేసుకోవడానికి రష్యా సైన్యం దాడులు చేస్తోన్నాయి. బేబిన్యార్, మరియోపోల్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి.

ఆరువేలమంది మృతి..
ఇదే దూకుడును ప్రదర్శించితే కీవ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు. రష్యా సైన్యం వేల సంఖ్యలో మరణించినట్లు వెల్లడించారు. ఆరు రోజుల వ్యవధిలో రోజుకు వెయ్యి మంది చొప్పున రష్యా సైనికులు తాము జరిపిన ఎదురుదాడి, ప్రతిఘటనా చర్యల్లో మృతిచెందినట్లు చెప్పారు.

రష్యాను ప్రతిఘటిస్తోన్నాం..
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్న యుద్ధంలో ఇప్పటి దాకా చోటు చేసుకున్న పరిణామాలను ఆయన వివరించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తటస్థంగా ఉండే దేశాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అలాంటి దేశాలకు చురకలు అంటించారు. రష్యా తమపై దండెత్తుతోందని, ఆ దేశ చర్యలను తాము ప్రతిఘటిస్తోన్నామని చెప్పారు. తమ శక్తికి మించిన స్థాయిలో పోరాటం చేస్తోన్నామని పేర్కొన్నారు.

తటస్థంగా ఉండే సమయం లేదిక..
ఈ యుద్ధంలో తటస్థ వైఖరి వల్ల ఉపయోగం లేదని జెలెన్‌స్కీ తేల్చి చెప్పారు. తటస్థంగా ఉండే పరిస్థితులు ఇప్పుడు లేవని అన్నారు. తటస్థంగా ఉండటానికీ ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన తటస్థ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్లను నామరూపాల్లేకుండా చేయాలనేదే రష్యా లక్ష్యంగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పూర్తిస్థాయి సైనిక సహకారాన్ని అందించడానికి అన్ని దేశాలు కదిలి రావాలని కోరారు.

బేబిన్యార్..మరియోపొల్‌పై
మరోవంక- బేబిన్యార్, మరియోపోల్ నగరాలపై రష్యా సైనిక బలగాలు బాంబుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి. ఈ ఆరు రోజుల్లో ఎప్పుడూ లేనంత ఉధృతిని ప్రదర్శిస్తోన్నాయి. మరియోపోల్‌పై ఎడతెరిపి లేకుండా రష్యా సైన్యం దాడులు చేస్తోందని, దాన్ని తమ సైనికులు తిప్పి కొడుతున్నారని నగర మేయర్ తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడానికి, దాడుల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి వీలు కావట్లేదని అన్నారు.

కీవ్‌పై భారీ దాడులు..
నిన్నటి వరకూ కీవ్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా సైనిక బలగాలు ఇవ్వాళ మరింత సమీపానికి దూసుకొచ్చాయి. రాజధానిని చుట్టుముట్టాయి. కీవ్‌లోని భారీ భవంతులు, ప్రభుత్వ కార్యాలయాలపై రాకెట్లను సంధిస్తోన్నాయి. మిలటరీ అకాడమీ, ఆసుపత్రి ధ్వంసం అయ్యాయి. మంటల బారిన పడ్డాయి. ఈ దాడులను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్ సైనికులు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోన్నాయి. ఈ పరిణామాల మధ్యే జెలెన్‌స్కీ.. తన వీడియో సందేశాన్ని విడుదల చేశారు.












Click it and Unblock the Notifications