భారత్‌తో గొడవకు దిగిన ఉక్రెయిన్: రాత్రికి రాత్రి సంచలన నిర్ణయం: ఆ దేశాలకూ వార్నింగ్
కీవ్: నెలలు గడుస్తున్నప్పటికీ.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి తెర పడట్లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే వస్తోంది. ఈ రెండు దేశాలు ఎక్కడా తగ్గట్లేదు. వెనకడుగు వేయట్లేదు. ఢీ అంటే ఢీ అంటోన్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాతో పాటు యూరోపియన్ యూనియన్ (ఈయూ), నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) సభ్య దేశాలు అండగా నిలవడంతో ఉక్రెయిన్ ధీటుగా బదులిస్తోంది.

రోజులు తరబడి..
యూరోపియన్ యూనియన్, నాటో సభ్య దేశాలు పలు ఆంక్షలు, నిషేధాజ్ఞలను విధించినప్పటికీ.. రష్యా ఏ మాత్రం ఖాతరు చేయట్లేదు. లక్ష్యం వైపు దూసుకెళ్తూనే ఉంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో సాగుతుంది. ఇప్పటికే క్రిమియా, ఖేర్సన్, డాన్‌బాస్, మరియొపొల్, లుహాన్స్క్, డొనెట్స్క్, ఖార్కీవ్, మైకొలైవ్.. వంటి సరిహద్దు నగరాలు రష్యా ఆధీనంలోకి వెళ్లాయి. ఒడెస్సాను సొంతం చేసుకోవడం వల్ల నల్ల సముద్రంతో ఉక్రెయిన్ సంబంధాలను తెంచేసింది రష్యా.

తటస్థంగా భారత్..
ఈ యుద్ధం విషయంలో భారత్ సహా కొన్ని దేశాలు తటస్థంగా వ్యవహరిస్తోన్నాయి. రష్యాతో దశాబ్దాల కాలంగా కొనసాగుతూ వస్తోన్న స్నేహ సంబంధాల వల్ల భారత్.. తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. యుద్ధాన్ని వ్యతిరేకిస్తోంది గానీ- రష్యాను గానీ, ఉక్రెయిన్‌ను గానీ సమర్థించట్లేదు. చర్చల ద్వారా, శాంతియుత వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవాలనే వాదనకు కట్టుబడి ఉంది భారత్. ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతమండలి, జీ7 శిఖరాగ్ర సదస్సు వంటి అంతర్జాతీయ స్థాయి అత్యున్నత వేదికల మీదా స్పష్టం చేసింది.

రాయబారి తొలగింపు..
ఈ పరిస్థితుల మధ్య ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ.. సంచలన నిర్ణయాన్ని తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్‌తో ఘర్షణ వైఖరికి దిగినట్టయింది. భారత్‌లోని తమ దేశ రాయబారిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఉన్నట్టుండి తొలగించారు. దీనికి అవసరమైన డిక్రీని జారీ చేశారు. భారత్‌లోని తమ దేశ రాయబారిని ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే విషయం మీద ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీనికి గల కారణాలనూ వెల్లడించలేదు. అలాగని- కొత్త వారిని కూడా ఆ స్థానంలో నియమించలేదు.

దౌత్య సంబంధాలు తెంచేసుకున్నట్టా?
ఒక దేశం నుంచి తమ రాయబారిని తొలగించడం లేదా వెనక్కి పిలిపించుకోవడం అంటే.. దౌత్య సంబంధాల విషయంలో అదో అతి కీలక నిర్ణయమౌతుంది. ఆ దేశంతో సంబంధాలను తెంచుకున్నట్టే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు భారత్ విషయంలో ఉక్రెయిన్ అలాంటి నిర్ణయాన్నే తీసుకుందని అభివర్ణిస్తోన్నారు. భారత్‌తో ఘర్షణ వైఖరికి దిగినట్టుగా భావించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తోన్నారు.

ఆ నాలుగు దేశాలకు కూడా..
భారత్ మాత్రమే కాకుండా- జర్మనీ, చెక్ రిపబ్లిక్, నార్వే, హంగేరి దేశాల రాయబారులను కూడా జెలెన్‌స్కీ తొలగించారు. ఈ అయిదు దేశాలు రష్యా నుంచి పెద్ద ఎత్తున క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటోండటమే కారణమనే వాదనలు లేకపోలేదు. దీనిపై భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా స్పందించారు. తాను త్వరలోనే భారత్‌కు తిరిగి వస్తాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తనను తొలగించిన విషయాన్ని ఆయన ధృవీకరించారు.












Click it and Unblock the Notifications