ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆ ఒక్క కీలక సంతకం: రష్యాను మరింత రెచ్చగొడుతోందా?
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆరంభమైన యుద్ధం ఆరో రోజుకు చేరుకుంది. యుద్ధాన్ని నివారించడానికి ఈ రెండు దేశాల మధ్య బెలారస్‌లోని గోమెల్ సిటీలో ఏర్పాటైన శాంతి చర్చలు విఫలమైన అనంతరం- ఇది కాస్త మరింత తీవ్రతరమైంది. రష్యా తన దాడిని మరింత ఉధృతం చేసింది. ఉక్రెయిన్‌లోని ఒక్కో నగరాన్నీ ఆక్రమించుకుంటోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ సైనిక బలగాల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్నీ చవి చూస్తోంది రష్యా. 4,500 మందికి పైగా రష్యన్ సైనికులు మరణించినట్లు చెబుతున్నారు.
అణ్వాయుధాల ప్రయోగం కోసం..
ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అణ్వాయుధాలను ప్రయోగించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్- న్యూక్లియర్ ట్రియాడ్‌ను యాక్టివేట్ చేశారు. న్యూక్లియర్ ట్రియాడ్ అంటే- భూమి, వాయు, జలమార్గాల్లో ప్రత్యర్థిపై అణ్వాయుధాలతో దాడికి దిగడం. ఈ మూడు విభాగాల అధిపతులను పుతిన్ హైఅలర్ట్ చేశారు. ఏ క్షణమైనా అణ్వాయుధాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉండాలంటూ ఉత్తర్వులు చేశారు.
ఆ దరఖాస్తుపై సంతకం
ఈ పరిణామాల మధ్య ఉక్రెయిన్ కూడా ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం కోసం దరఖాస్తును దాఖలు చేసింది. ఈ దరఖాస్తుపై ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ సంతకం చేశారు. ఈ దరఖాస్తును యూరోపియన్ యూనియన్ కమిషన్‌కు పంపించారు. సంతకం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇదొక చారిత్రాత్మక సందర్భంగా అభివర్ణించారు. ఈయూలో తక్షణమే సభ్యత్వాన్ని కల్పించాలంటూ డిమాండ్ చేసిన కొన్ని గంటల్లోనే ఆయన ఈ దరఖాస్తుపై సంతకం చేశారు.

రష్యాను రెచ్చగొట్టిందా?
ఈ చర్య రష్యాను మరింత రెచ్చగొట్టినట్టవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో చేరడానికి ఉక్రెయిన్ సిద్ధపడటం వల్లే రష్యా ఆ దేశంపైకి దండెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవడం ఆగ్రహావేశాలకు గురి చేస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. బెలారస్‌లోని గోమెల్ సిటీలో నిర్వహించిన శాంతి చర్చల్లో ఉక్రెయిన్ తన డిమాండ్‌కు అంగీకరించకపోవడంతో అసహనంతో ఉన్న రష్యా- ఈ చర్యను తీవ్రంగా పరిగణిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

రష్యాపై ఈయూ నిప్పులు..
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై ఇప్పటికే యూరోపియన్ యూనియన్ దేశాలు నిప్పులు చెరుగుతున్నాయి. అన్ని దేశాలు కూడా ఆంక్షలను విధించాయి. రష్యన్ విమానాల కోసం తమ గగనతలాన్ని మూసివేశాయి. అటు అగ్రరాజ్యం అమెరికా, కెనడా సైతం రష్యాపై భగ్గుమంటోన్నాయి. యూరోపియన్ యూనియన్‌లో ప్రస్తుతం 27 దేశాలకు సభ్యత్వం ఉంది. ఆయా దేశాలన్నీ ఉక్రెయిన్ పట్ల సానుభూతి వైఖరిని ప్రదర్శిస్తోన్నాయి. ఈ పరిణామాలతో ఈయూలో సభ్యత్వం లభించడం లాంఛనప్రాయమేననే అభిప్రాయాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications