తాలిబన్లు మోసం చేశారు-అమెరికా కీలక వ్యాఖ్యలు-దోహా ఒప్పందం అమల్లో విఫలం
గతేడాది అమెరికా-తాలిబన్ల మధ్య కుదిరిన దోహా ఒప్పందం అమల్లో భాగంగా అగ్రరాజ్యం ఆప్ఘనిస్తాన్ ను వీడి వెళ్లిపోయింది. దీంతో తాలిబన్లు సునాయాసంగా అధికారాన్ని చేజిక్కించుకోవడంతో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. తాలిబన్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని గౌరవించి అమెరికా ఆప్ఘనిస్తాన్ ను వీడినా, తాలిబన్లు మాత్రం తమకు హ్యాండ్ ఇచ్చారని అమెరికా ఇప్పుడు చెబుతోంది.
గతేడాది అమెరికా-తాలిబన్ల మధ్య కుదిరిన దోహా ఒప్పందం ప్రకారం తాలిబన్లు ఏడు షరతులను, అమెరికా 8 షరతులను పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరిద్దరూ ఈ షరతులను అమలు చేయడానికి ఒప్పుకున్న తర్వాతే అమెరికా తన బలాగాలను ఆప్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకోవడానికి అంగీకరించింది. కానీ అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత కూడా తాలిబన్లు తమకు ఇచ్చిన ఏడు షరతులను పూర్తిగా అమలు చేయలేదని అమెరికా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని అమెరికా సైనిక జనరల్ మార్క్ మిల్లే తాజాగా సైనిక సమావేశంలో ప్రస్తావించారు.

అమెరికాతో కుదుర్చుకున్న దోహా ఒప్పందం ప్రకారం తాలిబన్లు నేరుగా కానీ, పరోక్షంగా కానీ అమెరికన్లపై దాడులు చేయకూడదు. కానీ తాలిబన్లు దాడులు చేయకపోయినా వారి అనుబంథంగా ఉన్న అల్ ఖైదా ఉగ్రవాద సంస్ధ మాత్రం అమెరికన్లను టార్గెట్ చేస్తోంది. దీంతో తాలిబన్లు దోహా ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయలేదని అమెరికా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అయితే దీనిపై తాలిబన్లు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ లో నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో అల్ ఖైదాను పూర్తిగా నిలువరించే పరిస్దితుల్లో తాలిబన్లు లేరు. దీంతో అమెరికా తాలిబన్ల వైఖరిపై మండిపడుతోంది.
మరోవైపు అప్ఘనిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై అమెరికా అసంతృప్తిగా ఉంది దోహా ఒప్పందం అమల్లో వైఫల్యంతో పాటు అల్ ఖైదాతో బంధం తెంచుకునేందుకు తాలిబన్లు మొరాయిస్తున్న నేపథ్యంలో ఆప్ఘన్ లో యుద్ధం ముగిసినట్లు కాదని అమెరికా చెబుతోంది.. అల్ ఖైదా తో కలిసి ఉన్నంతసేపు తాలిబన్లను కూడా ఉగ్రవాద సంస్ధగానే చూస్తామని ఆర్మీ జనరల్ మార్క్ మిల్లే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్లపై జరిగే దాడుల్ని అడ్డుకోవడం తమ బాధ్యతని, ఇందులో భాగంగా తాలిబన్లను దోహా ఒప్పందం అమలు కోసం పట్టుబడతామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా తమ ప్రభుత్వానికి గుర్తింపు కోసం తాలిబన్లు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అమెరికా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications