అమెరికాను వణికించిన పెను భూకంపం..!!
వాషింగ్టన్: అమెరికాలో పెను భూకంపం సంభవించింది. కాలిఫోర్నియాను వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా రికార్డయింది. ఈ భూకంపం వల్ల ప్రాణ హాని సంభవించినట్లు ఇప్పటివరకు వార్తలు అందలేదు. కొంత మేర ఆస్తి నష్టం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. భూకంపం ధాటికి కొన్ని భవనాలు బీటలు వారినట్లు యూఎస్ మీడియా చెబుతోంది.
కాలిఫోర్నియా ఉత్తర ప్రాంతంలో ఆ దేశ కాలమానం ప్రకారం.. సాయంత్రం 4:19 నిమిషాలకు భూమి కంపించింది. కాలిఫోర్నియా ఉత్తర ప్రాంతంలోని సియారా నెవెడా, ప్లూమాస్ కంట్రీ, లేక్ అల్మనార్, లాస్సెన్ నేషనల్ పార్క్ సమీపంలోని సుసాన్ విల్లె టౌన్‌ను భూకంప కేంద్రంగా గుర్తించారు. ఉపరితలం నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి ప్రకంపించినట్లు యూఎస్ జియాలాజికల్ సర్వే తెలిపింది.

దీని తీవ్రత సుమారు 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాక్రమెంటో సిటీలో కనిపించింది. భూకంపం సంభవించిందంటూ సాక్రమెంటో నివాసులు ట్వీట్ల ద్వారా తెలియజేశారు. వస్తువుల కదలికలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్‌ను ట్వీట్ చేశారు. భూమి కంపించిన వెంటనే స్థానికులు రోడ్డు మీదికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి.
వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై గరిష్ఠంగా 3.1గా రికార్డయినట్లు యూఎస్ జియాలాజికల్ సర్వే పేర్కొంది. భూకంప ప్రభావం సాక్రమెంటో సిటీ, ప్లేసర్, ఎల్ డొరాడో, సాన్ సొవాక్విన్, సొలానో, కొలుస, నెవడా, యోలో, రెనో.. వంటి ప్రాంతాల్లో కనిపించినట్లు తెలిపింది. దీనితో స్థానికులు ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. చాలాసేపటి వరకు రోడ్ల మీదే కాలం గడిపారు. సాక్రమెంటో సిటీలో కొన్ని చోట్ల భవనాలకు బీటలు వారినట్లు స్థానికులు ట్వీట్ల ద్వారా తెలియజేశారు.












Click it and Unblock the Notifications