ప్రిడేటర్: బ్లాక్ అమెరికన్లను జంతువులతో పోల్చిన జో: ఇంకొక్క ఛాన్స్ ఎందుకివ్వాలి: నేతల వార్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. తూటాల్లాంటి మాటలను సంధించుకుంటున్నారు. పరస్పరం ఆరోపణలకు దిగారు. సోషల్ మీడియా వేదికగా మినీ యుద్ధానికి తెర తీశారు. రిపబ్లికన్ పార్టీ తరఫున రెండోసారి పోటీ చేస్తోన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ల అభ్యర్థి జో బిడెన్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం నడుస్తోంది. ట్వీట్ల ద్వారా విమర్శలను గుప్పించుకుంటున్నారు.
బ్లాక్ అమెరికన్లపై యథేచ్ఛగా దాడులకు కారకుడు..
ఈ ఇద్దరు నేతల మధ్య కొనసాగుతోన్న ఆరోపణలు, ప్రత్యారోపణల వ్యవహారం వ్యక్తిగత దాడులకూ దారి తీస్తోంది. అమెరికాలో నివసిస్తోన్న నల్లజాతీయులపై దాడులకు జో బిడెన్ కారకుడయ్యాడంటూ డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. 47 సంవత్సరాలుగా జో బిడెన్ బ్లాక్ అమెరికన్లపై ఏదో ఒక రూపంలో దాడులు సాగిస్తున్నాడని ఆరోపించారు. జో బిడెన్‌ను సూపర్ ప్రిడేటర్‌గా అభివర్ణించారు. ఒక జంతువు మరో జంతువును అతి దారుణంగా చంపి భక్షించేలా జో బిడెన్ వ్యవహరిస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు.
బిడెన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయండి..
ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రతి బ్లాక్ అమెరికన్ తన ఓటు హక్కును వినియోగించుకోవాలని, జో బిడెన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జో బిడెన్‌ను, ఆయన దుర్మార్గాలను ఎదుర్కొనడానికి ఇదొక్కటే అవకాశం అని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే.. నల్ల జాతీయులపై దాడులు చేయాలని, వారిని జైలుకు పంపాలని కలలు గంటోన్న జో బిడెన్‌కు ఓటు అనే ఆయుద్ధంతో బుద్ధి చెప్పాలని ట్రంప్ విజ్ఙప్తి చేశారు. అధికారాన్ని అందుకుంటే.. నల్ల జాతీయుల వినాశనానికి బిడెన్ ప్రయత్నిస్తారని ఆరోపించారు. ఈ మేరకు ట్రంప్ ఓ ట్వీట్ చేశారు.

కౌంటర్ ఇచ్చిన బిడెన్..
అదే ట్విట్టర్ వేదికగా జో బిడెన్.. డొనాల్డ్ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. ఆధునిక అమెరికాలో అత్యంత అవినీతిపరుడుగా డొనాల్డ్ ట్రంప్ ముద్ర వేయించుకున్నారని ఆరోపించారు. అత్యంత జాత్యహంకార అధ్యక్షుడిగా అతణ్ని అమెరికన్లు గుర్తిస్తున్నారని విమర్శించారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో లక్షలాది మంది అమెరికన్లు ఉపాధిని కోల్పోయారని, వరస్ట్ జాబ్స్ ప్రెసిడెంట్‌గా ఆధునిక చరిత్రలో ఆయన నిలిచిపోతారని ధ్వజమెత్తారు. మరొక్క అవకాశం ఇవ్వాలని ఆయన అమెరికన్లను కోరుతున్నారని, ఎందుకివ్వాలనే ప్రశ్నకు ట్రంప్ వద్ద సమాధానం లేదని అన్నారు. మరో నాలుగేళ్ల పాటు పరిపాలించే అధికారం ట్రంప్‌కు ఎందుకివ్వాలని జో బిడెన్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications