మోదీ కంటే ఓ రెండాకులు ఎక్కువే చదివిన ట్రంప్
టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాతో సత్సంబంధాలను కొనసాగిస్తోన్నందున భారత్ పై కొరడా ఝుళిపిస్తోన్నారు. క్రమంగా ఇది రెండు దేశాల మధ్య తీవ్ర అగాథాన్ని సృష్టిస్తోంది. దౌత్య సంబంధాలు దెబ్బతినేంత వరకూ వెళ్లిందీ పరిస్థితి.
ఈ పరిణామాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్ లో మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా వెల్లడించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య, ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చాయని తెలిపారు.

తమ రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని మోదీ- పుతిన్ పునరుద్ఘాటించారు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయడాన్ని మోదీ సమర్థించుకున్నారు. దేశ ప్రయోజనాలు, ఆర్థిక స్థిరత్వం కోసం మున్ముందు క్రూడాయిల్ కొనుగోళ్లు కొనసాగుతాయనీ స్పష్టం చేశారు.
అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వ్లాదిమిర్ పుతిన్ ను స్వయంగా కలుసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన అలస్కాలో పుతిన్ తో ముఖాముఖి భేటీ కానున్నట్లు చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని వివరించారు.
తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా.. రష్యాకు చెందిన తన కౌంటర్ పార్ట్ వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశం కావడానికి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు. ఈ సమావేశం వచ్చే శుక్రవారం, ఆగస్టు 15వ తేదీన అలస్కాలో జరుగుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.
పదేళ్లలో పుతిన్ అమెరికాకు రావడం ఇదే మొదటిసారి. చివరిసారిగా ఆయన 2015 సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి హాజరయ్యారు. ఆ తరువాత మళ్లీ ఆయన అమెరికాకు రావడం ఇదే తొలిసారి అవుతుంది.
ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్‌తో చర్చించాలని తాను యోచిస్తున్నట్లు ట్రంప్ విలేకరులకు తెలిపిన కొద్ది గంటలకే ఈ ప్రకటన వెలువడింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ మాస్కోలో పుతిన్‌ను కలిసిన తర్వాత ఈ సమావేశం గురించి క్రెమ్లిన్ ముందే ప్రకటించింది.












Click it and Unblock the Notifications