ఆ కారు ఎవరిది- హైఅలర్ట్?
US Presidential Elections 2024: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడిగా పతాక స్థాయికి చేరింది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు.
నవంబర్ 5వ తేదీన అక్కడ పోలింగ్ జరుగనుంది. డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే. నార్త్ కరోలినా, ఆస్టిన్, టెక్సాస్, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఇప్పటికే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ముమ్మర ప్రచారాన్ని సాగిస్తోన్నారు.

ఈ ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజీ పలు చోట్ల బ్యాలెట్ డ్రాప్ బాక్సులను సైతం ఏర్పాటు చేసింది. పోర్ట్‌ల్యాండ్, మిచిగాన్, ఒరెగాన్, వాషింగ్టన్, వాంకూవర్, టెక్సాస్, పెన్సిల్వేనియా, పిట్స్ బర్గ్.. వంటి అనేక ప్రాంతాల్లో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పలు బ్యాలెట్లు పోల్ అయ్యాయి.
కొన్ని చోట్ల ఈ బ్యాలెట్ బాక్సులను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. వాటిని పగులగొట్టి బ్యాలెట్ పేపర్లను చిందరవందర చేశారు. వాటిని చింపేసి, రోడ్లపై వెదజల్లారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది- ఎన్నికల ప్రక్రియపై అనుమానాలను లేవనెత్తినట్టయింది.
పోర్ట్‌ల్యాండ్, వాంకూవర్, ఒరెగాన్‌లల్లో ఇలాంటి సంఘటనలు సంభవించినట్లు ఫిర్యాదులు అందాయిని పోర్ట్‌ల్యాండ్ పోలీస్ బ్యూరో అసిస్టెంట్ చీఫ్ అమండా మెక్‌మిలన్ వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో ఒరెగాన్‌లో తొలి సంఘటన చోటు చేసుకుందని అన్నారు.

దీని తరువాత వాంకూవర్, పోర్ట్‌ల్యాండ్‌లల్లో కూడా బ్యాలెట్ బాక్సులను తగులబెట్టినట్లు ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. ఈ ఘటనలో మొత్తం మూడు బ్యాలెట్ బాక్సులు పూర్తిగా ధ్వంసం అయ్యాయని మౌల్ట్‌నోమా కౌంటీ ఎన్నికల డైరెక్టర్ టిమ్ స్కాట్ తెలిపారు. 409 బ్యాలెట్ బాక్స్‌కు కూడా నిప్పు పెట్టారని, సకాలంలో మంటలను ఆర్పివేయగలిగామని అన్నారు.
ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు ఎన్నికల అధికారులు. సమగ్ర నివేదిక అందజేయాలంటూ ఆయా రాష్ట్రాల ఎన్నికల డైరెక్టర్లకు సూచించారు. సీసీటీవీల్లో రికార్డయిన ఫుటేజీల ద్వారా దర్యాప్తు మొదలుపెట్టామని వాంకోవర్ పోలీస్ విభాగం అధికార ప్రతినిధి లారా షెప్పర్డ్ చెప్పారు. నంబర్ ప్లేట్ లేని ఓ కారు వాంకూవర్ బ్యాలెట్ బాక్స్ దగ్గర కనిపించిన ఘటన ద్వారా దర్యాప్తు సాగిస్తున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications