నో అసైలమ్- టూరిజం Visa పై అమెరికా ఉక్కుపాదం: కుప్పలు తెప్పలుగా రద్దు
అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలుగనే భారతీయ ఐటీ నిపుణులు, టెక్కీలపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. కొత్త హెచ్-1బీ (H-1B) వీసాల ఫీజును భారీగా పెంచాలని ప్రతిపాదించారు. ఇప్పటికే ఈ వీసా ఫీజు లక్ష డాలర్లు ఉంటోంది. దీన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకున్నారు. నూతన ఫీజు మొత్తాన్ని కూడా ఖరారు చేశారు. ఈ మేరకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాజా ప్రతిపాదనలను రూపొందించింది.
అదే సమయంలో మరో షాక్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో నివసిస్తోన్న ఇతర దేశస్తులు, భవిష్యత్తులో ఆ దేశానికి వెళ్లాలనుకునే వారికి మింగుడు పడని వార్తే ఇది. టూరిస్ట్ లేదా బిజినెస్ వీసాలపై అమెరికాకు చేరుకుని, ఆ తర్వాత అక్కడ శాశ్వతంగా నివసించాలనే ఉద్దేశంతో అసైలమ్.. అంటే శరణార్థులుగా దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది వీసాలను రద్దు చేయబోతోన్నారు. దీనికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సుమారు రెండు లక్షల మంది ఇతర దేశస్తులకు చెందిన బిజినెస్, టూరిజం వీసాలన్నింటినీ కూడా రద్దు చేసే దిశగా అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ నూతన ప్రణాళికను రూపొందించింది. దీనిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 2016 నుండి 2026 మధ్య కాలంలో జారీ చేసిన బీ1 (బిజినెస్), బీ2 (టూరిజం) వీసాలు పొంది, ఆ తర్వాత అక్కడే నివసించడానికి వీలుగా ఈ అసైలమ్ దరఖాస్తులను సమర్పించిన వారిని లక్ష్యంగా చేసుకోనున్నారు.
ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే.. అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ వీసా రద్దు ప్రక్రియగా నిలిచిపోతుందీ అంశం. తాత్కాలిక ప్రయాణికుల హోదాలో అమెరికాకు వస్తున్నామంటూ మొదట దరఖాస్తు చేసుకుని, ఆ తర్వాత శాశ్వతంగా అక్కడే ఉండిపోవడానికి అసైలమ్ హోదా కోసం ప్రయత్నిస్తున్నారని అధికారులు గుర్తించారు. దీనిద్వారా అమెరికా వలస విధానాన్ని, చట్టాలను ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తున్నారని విదేశాంగ శాఖ ప్రత్యేక ప్రతినిధి టామీ పిగోట్ పేర్కొన్నారు.
ఇలాంటి వారిని గుర్తించి, వారి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను రద్దు చేయడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీతో కలిసి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అసైలమ్ హోదా పొందడాన్ని అమెరికాలో ప్రవేశించడానికి ఓ మార్గంగా మార్చుకోవడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రెటరీ క్రిస్టోఫర్ లాండౌ కూడా స్పష్టం చేశారు. వీటిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.
తమ పర్యటన పూర్తయిన వెంటనే స్వదేశాలకు తిరిగి వెళ్లిపోతామనే బలమైన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది.. బీ1, బీ2 వీసా దరఖాస్తుదారులకు. అక్కడికి చేరిన తర్వాత దీన్ని నిబంధనలను ఉల్లంఘించి అమెరికాలోని శాశ్వతంగా మకాం వేసేలా అసైలమ్ దరఖాస్తులను సమర్పిస్తుంటారు. ఇలాంటి దరఖాస్తులు ప్రస్తుతం రెండు లక్షల వరకు దాఖలయ్యాయి. వీటన్నింటినీ కూడా రద్దు చేస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలా చేస్తే పర్యాటక, బిజినెస్ హోదాను శాశ్వతంగా కోల్పోతారని వివరించింది. దీనివల్ల భవిష్యత్తులో అమెరికా వీసాలు పొందే అవకాశాలు కూడా పూర్తిగా దెబ్బతింటాయి కూడా.














Click it and Unblock the Notifications