కదనరంగంలో అమెరికా: ఆర్థిక ఆంక్షలు: ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఫోన్ కాల్: అయినా ఆ ధోరణి
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో- అంతర్జాతీయ స్థాయి పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్, లుహాన్స్క్ రీజియన్లను స్వతంత్ర దేశాలుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ప్రకటన దీనికి కారణమైంది. ఈ రెండు రీజియన్లు ఇక స్వతంత్రంగా వ్యవహరిస్తాయంటూ పుతిన్ చేసిన ప్రకటన.. అమెరికాను కదనరంగంలోకి దింపినట్టయింది. అగ్రరాజ్యానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
పుతిన్ చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి రష్యా భంగం కలిగించిందని వ్యాఖ్యానించారు. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర రీజియన్లుగా ప్రకటించడాన్ని తాము అంగీకరించట్లేదని అన్నారు. దీన్ని తోసిపుచ్చుతున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో ఉన్న డొనెట్స్క్, లుహాన్స్క్ రీజియన్లనపై ఆర్థిక పరమైన ఆంక్షలను విధించారు.
తమ దేశానికి చెందిన పెట్టుబడిదారులెవ్వరూ అక్కడ ఇన్వెస్ట్ చేయకూడదని ఆదేశించారు. ఈ రెండు ప్రాంతాలకు చెందిన పరిశ్రమలు, ఇతర వ్యక్థులు/సంస్థలకూ ఇవి వర్తిస్తాయని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ పిసాకీ తెలిపారు. అదే సమయంలో- వ్లాదిమిర్ పుతిన్‌తో దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా లేమని విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ సైతం స్పష్టం చేశారు. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్రంగా ప్రకటించడంతో రష్యా ఆ పరిధిని దాటిందని అన్నారు.

డొనెట్స్స్, లుహాన్స్క్‌లను తాము గుర్తించబోమని చెప్పారు. రష్యాపై ఎలాంటి చర్యలకు దిగాలనే విషయంపై ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నామని బ్లింకెన్ స్పష్టం చేశారు. భద్రతమండలి తీర్మానానికి అనుగుణంగా తమ తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. రష్యా తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థించట్లేదని, ఈ విషయంపై అంతర్జాతీయ మద్దతును కూడగడుతున్నామని అన్నారు. ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు తమతో కలిసి వస్తాయని పేర్కొన్నారు.
ఈ పరిణామాల మధ్య జో బైడెన్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీకి ఫోన్ చేశారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. డొనెట్స్, లుహాన్స్క్‌లను రష్యా.. ఇండిపెండెంట్ స్టేట్స్‌గా ప్రకటించడాన్ని తాము అంగీకరించట్లేదని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రత సమితి అత్యవసర భేటీలో ఈ విషయాన్ని స్పష్టం చేస్తామని అన్నారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో వెనుకంజ వేయబోమని స్పష్టం చేశారు. ఆ ప్రాంతాలపై ఆంక్షలను విధించామనే విషయాన్ని వొలొదిమిర్‌కు వివరించారు.












Click it and Unblock the Notifications