భారత్ కు రష్యా బిగ్ షాక్..! ఫలిస్తున్న ట్రంప్ వ్యూహం..!
రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్దానికి ఆజ్యం పోస్తున్నారనే కారణంతో భారత్ పై అమెరికా గతంలో 50 శాతం సుంకాలు విధించింది. అయినా భారత్ మిత్రదేశానికి అండగా నిలబడాలనే నిర్ణయించుకుంది. అదే సమయంలో జాతీయ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని రష్యా చమురు కొనుగోళ్లు ఆపలేమని తేల్చిచెప్పేసింది. ఈ విషయంలో భారత్ రాజీ పడకపోవడంతో ట్రంప్ సర్కార్ సుంకాల తగ్గింపు విషయంలోనూ వెనక్కి తగ్గడం లేదు.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహం మార్చారు. భారత్ పై ఒత్తిడి పెంచి ఉపయోగం లేదని భావించిన ట్రంప్.. రష్యా చమురు రిఫైనరీలను టార్గెట్ చేసారు. ఈయూతో కలిసి రష్యాలోని చమురు రిఫైనరీలపై ఆంక్షలు విధించడం ప్రారంభించారు.ఈ ఆంక్షల్ని ఈ నెల 21 నుంచి అమల్లోకి తీసుకువస్తున్నారు. దీంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రష్యా చమురు కంపెనీలు కాస్తా వెనక్కి తగ్గక తప్పడం లేదని తెలుస్తోంది.

భారత్ కు ఎగుమతి చేస్తున్న డిస్కౌంట్ చమురును తగ్గించుకోవాలని రష్యా ఆయిల్ రిఫైనరీలు నిర్ణయించాయి. అక్టోబర్ నెల ఆరంభ వారాలతో పోలిస్తే చివరి వారానికి భారత్ కు ఎగుమతి చేస్తున్న చమురును రోజుకు 1.95 మిలియన్ బ్యారెళ్ల నుంచి 1.19 మిలియన్ బ్యారెళ్లకు అవి తగ్గించేసినట్లు అంతర్జాతీయ వెసెల్ ట్రాకర్ కెప్లర్ డేటా చెబుతోంది. ఈ మేరకు రష్యా చమురు రిఫైనరీలు రోజ్ నెఫ్ట్, లూక్ ఆయిల్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై మరో నెల రోజుల్లో మరింత క్లారిటీ వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత్ ను రష్యా చమురు కొనకుండా ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేసి విఫలమైన ట్రంప్.. ఇప్పుడు ఆ దేశ చమురు రిఫైనరీలను టార్గెట్ చేయడం ద్వారా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తున్నట్లు అర్దమవుతోంది. అదే జరిగితే భారత చమురు రిఫైనరీలు ఇప్పుడు రష్యా కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే దుబాయ్ తో పాటు ఇతర గల్ఫ్ దేశాలను ఈ విషయంలో సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అమెరికా నుంచి కూడా చమురు దిగుమతులు పెంచే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications