మాకు సంబంధం లేదు.. మేము తలదూర్చం! భారత్ లో నిరసనలపై మార్కో రూబియో కామెంట్స్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఏం జరగాలనేది అక్కడి ప్రజలే నిర్ణయించుకుంటారని అమెరికా స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్లో జరుగుతున్న రాజకీయ నిరసనలపై జోక్యం చేసుకోవడానికి వాషింగ్టన్ సిద్ధంగా లేదని తేల్చిచెప్పింది. ఏ దేశంలోనైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడం, ప్రజలు తమ గళాన్ని వినిపించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సహజమైన ప్రక్రియ అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పష్టం చేశారు. భారత్లో పర్యటిస్తున్న ఆయన, అక్కడి ప్రస్తుత రాజకీయ పరిణామాలు, నిరసనల అంశంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సంఘంపై నిరసనలు.. అమెరికా ఏమంటోంది?
ప్రస్తుతం భారత్లో ప్రధాన ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఆందోళనలు బాటపట్టిన సంగతి తెలిసిందే. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా పేర్లు తొలగించడం, అక్రమాలు జరిగాయంటూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై అమెరికా విదేశాంగ కార్యదర్శిని మీడియా ప్రశ్నించగా.. అది పూర్తిగా భారత్ అంతర్గత రాజకీయ విషయమని ఆయన తేల్చిపారేశారు. "ఇది ప్రజాస్వామ్య దేశం.. ఇక్కడ ఎన్నికలు జరుగుతుంటాయి. కాబట్టి వారి అంతర్గత రాజకీయ విషయాలపై నేను ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయను" అని రూబియో కుండబద్దలు కొట్టారు. మరోవైపు, ఈ నిరసనలను అణచివేస్తున్నారంటూ కొందరు ఐక్యరాజ్యసమితి నిపుణులు చేసిన విమర్శలను ఆయన కొట్టిపారేశారు.

ఐక్యరాజ్యసమితి నిపుణులపై మార్కో రూబియో సెటైర్లు
భారత్లో నిరసనల నిర్వహణ తీరును తప్పుబట్టిన ఐక్యరాజ్యసమితి నిపుణులపై మార్కో రూబియో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఐక్యరాజ్యసమితి నిపుణులంటే తనకెంతో ఇష్టమని, అసలు ఆ పదమే ఓ విడ్డూరమని ఎద్దేవా చేశారు. ఐదు నెలల వ్యవధిలో భారత్లో ఆయన పర్యటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ప్రజాస్వామ్య దేశాల్లో శాంతియుతంగా నిరసనలు తెలపడం, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సర్వసాధారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఐరోపా దేశాల్లో జరుగుతున్న హింసాకాండ, భవనాలను తగలబెట్టే అల్లర్లతో వీటిని పోల్చలేమని, అసమ్మతిని గౌరవించే దేశాల్లో ప్రజలు తమ గళాన్ని వినిపించడం ఆ దేశ గొప్పతనాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు.
క్యూబాతో పోలిక.. భారత్ ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశంసలు
ప్రజాస్వామ్యానికి, నియంతృత్వ పాలనకు మధ్య తేడాను వివరిస్తూ రూబియో క్యూబా ఉదాహరణను తెరపైకి తెన్నారు. క్యూబాలో ప్రతిపక్షాలు గళం విప్పితే నేరుగా జైలుపాలవుతారని, లేదంటే దేశం విడిచి పారిపోవాల్సిన దుస్థితి ఉంటుందని గుర్తుచేశారు. కానీ, భారత్లో ప్రజలు తమ నిరసనలను స్వేచ్ఛగా వ్యక్తంచేసే వాతావరణం ఉందని, ఇది ఆ దేశ ప్రజాస్వామ్య బలానికి నిదర్శనమని పరోక్షంగా కొనియాడారు.
ఓటర్ల జాబితా సవరణ వివాదం.. ఈసీ వివరణ ఇదీ
ఈ రాజకీయ రగడకు అసలు కారణం ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియే. డూప్లికేట్ ఓట్లు, చనిపోయినవారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన అనర్హుల పేర్లను తొలగించేందుకే ఈ కసరత్తు చేపట్టినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం అప్పీలు చేసుకునే అవకాశం కల్పించామని ఈసీ తేల్చిచెప్పింది. ఏదేమైనా, భారత్లో ప్రజాస్వామ్య పద్ధతిలో సాగుతున్న పరిణామాలపై అమెరికా అగ్రనేత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.














Click it and Unblock the Notifications
