ఆయనొచ్చిన వేళ ఉగ్రవాదంపై ఇండియా గన్ షాట్ స్టేట్మెంట్
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోల భేటీ ఇరుదేశాల దౌత్య సంబంధాలలో కొత్త అధ్యాయానికి తెరతీసింది. రెండవసారి భారత్ పర్యటనకు వచ్చిన మార్కో రూబియోకు వాణిజ్య రాజధాని ముంబై ఘనస్వాగతం పలికింది. ముంబై వేదికగా జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు భారత్-అమెరికాలా వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సాంకేతిక రంగాలలో కొత్త అవకాశాలకు బాటలు పరిచాయి.
ఉగ్రవాదంపై జాతీయ స్పష్టత.. 26/11 బాధితులకు నివాళులు
ఈ పర్యటనలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఘట్టం 26/11 ఉగ్రదాడి బాధితులకు నివాళులర్పించడం. ముంబైలోని ప్రముఖ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో ఉన్న 26/11 స్మారక చిహ్నం వద్ద మార్కో రూబియో పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. ఈ దాడిలో ఆరుగురు అమెరికన్లు సహా 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్బంగా జైశంకర్ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై భారత్ తనను తాను రక్షించుకునే హక్కు విషయంలో ఎంతమాత్రం వెనక్కి తగ్గదని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ భాగస్వాములు కూడా ఉగ్రవాదం పట్ల 'జీరో టాలరెన్స్'ప్రదర్శించాలని ఆకాంక్షించారు. దాడి వెనుక ఉన్న కీలక సూత్రధారులలో ఒకరైన తహవ్వుర్ హుస్సేన్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా జైశంకర్ ప్రత్యేకంగా స్వాగతించారు.

తుది దశకు వాణిజ్య ఒప్పందం.. త్వరలోనే తీపి కబురు!
రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం అతి త్వరలోనే కార్యరూపం దాల్చనుందనే సంకేతాలు వెలువడ్డాయి. ఈ ఒప్పందాన్ని కొలిక్కి తెచ్చేందుకు ఇరుదేశాల బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని, త్వరలోనే తుది నిర్ణయానికి రాబోతున్నామని రూబియో స్పష్టం చేశారు. రష్యన్ చమురు దిగుమతులపై ఆంక్షలు విధించే క్రమంలో భారత ఇంధన అవసరాలను, గ్లోబల్ మార్కెట్‌లో ధరల స్థిరత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొనడం గమనార్హం. ప్రపంచ ఇంధన సరఫరాలో భారత్ అత్యంత కీలకమైన భాగస్వామి అని అమెరికా గుర్తించిందని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
వాణిజ్య రాజధానికి ప్రత్యేక అనుబంధం
అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకల ముందస్తు వేడుకలను ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ వేడుకల్లో మాట్లాడిన జైశంకర్, ముంబై నగరానికి అమెరికాతో ఉన్న చారిత్రక సంబంధాలను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు 'ఐస్ ట్రేడ్' తో ప్రారంభమైన బంధం, నేడు ఆర్థిక, సాంకేతిక, సినీ, పరిశోధనా రంగాల వరకు విస్తరించిందని చెప్పారు. ఇరుదేశాల పురోగతిలో భారత్ నుంచి వెళ్లిన నైపుణ్యం కలిగిన మానవ వనరులు కీలక పాత్ర పోషించాయని, రాబోయే రోజుల్లో 'క్వాడ్' సహా పలు రక్షణ, ఇంధన ప్రాజెక్టులు సరికొత్త మైలురాళ్లను సృష్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రక్షణ, సాంకేతిక పరిజ్ఞానంతో మరింత ము ముందుకు..
ఈ భేటీలో భారత్‌కు ఇంధన భద్రత అందించడంతో పాటు, అమెరికా రక్షణ పరిజ్ఞానం, సాంకేతిక వ్యవస్థల కొనుగోలును పెంచడంపై ప్రధానంగా చర్చించారు. ఇరుదేశాల సరఫరా వ్యవస్థలను శక్తివంతం చేయడం, ఇండో-పాసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలను పరిరక్షించడం ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ముంబై పర్యటన ముగించుకుని మార్కో రూబియో గుజరాత్‌లోని కీలకమైన ఇంధన కేంద్రమైన జామ్‌నగర్‌కు పయనం కానున్నారు. ఈ పర్యటన భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలలో నూతన ఉత్తేజాన్ని నింపిందనడంలో సందేహం లేదు.














Click it and Unblock the Notifications
