మీ జాగీర్ అనుకుంటున్నారా?: ఇరాన్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్!
హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై టోల్ లేదా ఎలాంటి రుసుములు వసూలు చేసేందుకు వీల్లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. బహ్రెయిన్‌లో జరిగిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఒకవేళ అంతర్జాతీయ జలమార్గాలపై ఏదైనా ఒక దేశం ఇటువంటి పన్నులు విధిస్తే దాని ప్రభావం ప్రపంచంలోని ఇతర సముద్ర మార్గాలపై కూడా పడుతుందని మార్కో రూబియో ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలో తీవ్ర గందరగోళానికి, అరాచకత్వానికి దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు.
గల్ఫ్ దేశాలకు భరోసా ఇచ్చేందుకే పర్యటన
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన మూడు రోజుల గల్ఫ్ పర్యటనలో భాగంగా చివరి దశలో బహ్రెయిన్ చేరుకున్నారు. ఇటీవలే అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరాన్‌తో అమెరికా చేసుకోబోయే ఎలాంటి ఒప్పందమైనా గల్ఫ్ దేశాల భద్రతకు, ప్రయోజనాలకు భంగం కలిగించబోదని మిత్రదేశాలకు భరోసా ఇవ్వడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. బహ్రెయిన్ అధికారులతో, జీసీసీ ప్రతినిధులతో జరిగిన ఈ కీలక సమావేశంలో ప్రాంతీయ భద్రత, ఇరాన్‌తో చర్చలు, హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన నౌకాయానం, మధ్యప్రాచ్యంలో శాంతి, స్థిరత్వం వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

జలమార్గాలు ఎవరి జాగీర్ కాదు!
ఈ సమావేశాన్ని ఉద్దేశించి మార్కో రూబియో మాట్లాడుతూ.. అంతర్జాతీయ జలమార్గాలు ఏ ఒక్క దేశానికి చెందిన సొంత ఆస్తి కాదన్నారు. కేవలం తమ ప్రాంతానికి సమీపంలో ఉందనే నెపంతో అంతర్జాతీయ జలమార్గాల గుండా వెళ్లే నౌకలపై రుసుములు వసూలు చేయడానికి అనుమతిస్తే.. అదే పద్ధతిని ప్రపంచంలోని మిగిలిన కీలకమైన సముద్ర మార్గాల్లోనూ ఇతర దేశాలు అనుసరించడం ప్రారంభిస్తాయని ఆయన పేర్కొన్నారు. అటువంటి పరిస్థితి వస్తే ప్రపంచ వాణిజ్యం, సముద్ర రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నింటికీ సముద్ర వాణిజ్య మార్గాలు సురక్షితంగా, తెరిచి ఉండాలనే సూత్రంపైనే ప్రస్తుత అంతర్జాతీయ వ్యవస్థ ఆధారపడి ఉందని ఆయన గుర్తు చేశారు.
ఒప్పందం కావాలి.. కానీ ఏ ధరకైనా కాదు!
ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా సిద్ధంగా ఉందని మార్కో రూబియో స్పష్టం చేశారు. ఇరు పక్షాలు పూర్తిగా విశ్వసించేలా, నిబంధనలను పారదర్శకంగా అమలు చేసేలా ఉండే ఒప్పందాన్ని మాత్రమే తాము కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. తమ ప్రాంతీయ భాగస్వామ్య దేశాల ఆర్థిక ప్రయోజనాలకు, భద్రతకు ముప్పు వాటిల్లే ఎలాంటి నిర్ణయాన్ని అమెరికా తీసుకోబోదని గల్ఫ్ దేశాలకు మార్కో రూబియో హామీ ఇచ్చారు. మిత్రదేశాల ఆందోళనలను అమెరికా చాలా తీవ్రంగా పరిగణిస్తుందని.. రాబోయే ఒప్పందాల్లో వారి ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని ఆయన ప్రకటించారు.













Click it and Unblock the Notifications