వీళ్లంతా చీప్ లేబర్? హెచ్ 1బీ, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పై జేడీ వ్యాన్స్ సెన్సేషనల్ కామెంట్స్
అమెరికాలో ఉద్యోగం చేయాలని, అక్కడే శాశ్వతంగా స్థిరపడాలని కలలు కనే వేలాది మంది ఐటీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. గ్లోబల్ టెక్ దిగ్గజాలతో పాటు ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీలపై ఆ దేశ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) ప్రోగ్రామ్ నుంచి ప్రముఖ ఐటీ సంస్థలను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికన్ల ఉద్యోగాలను రక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాషింగ్టన్ వర్గాలు స్పష్టం చేశాయి.
భారత ఐటీ కంపెనీలపై ప్రత్యక్ష ప్రభావం
అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమిని వంటి ప్రముఖ అవుట్‌సోర్సింగ్ కంపెనీలతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్ లాంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలపై ఈ నిరోధం విధించారు. ఈ కంపెనీలపై ప్రస్తుతం పలు ఫెడరల్ దర్యాప్తులు నడుస్తున్నందున PERM ప్రోగ్రామ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 2009 నుంచి ఈ ఒక్క కంపెనీలే సుమారు 30 లక్షల మంది విదేశీ ఉద్యోగుల కోసం వినతులు పంపాయని, 2.3 లక్షలకు పైగా హెచ్-1బీ వీసాలు, లక్షకు పైగా గ్రీన్ కార్డ్ సర్టిఫికేషన్లు పొందాయని, దీనివల్ల స్థానిక అమెరికన్ల ఉపాధి అవకాశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కార్మిక శాఖ తెలిపింది.

జేడీ వ్యాన్స్ సంచలన వ్యాఖ్యలు: వీసాదారులు "చీప్ లేబర్"?
ఈ వ్యవహారంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విదేశాల నుంచి వచ్చే హెచ్-1బీ వీసాదారులను ఐటీ సంస్థలు తక్కువ వేతనాలకే "చీప్ లేబర్" లాగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు. అమెరికా పౌరుడితో పోలిస్తే హెచ్-1బీ ఉద్యోగికి సంవత్సరానికి 20 వేల డాలర్లు, అదే అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వచ్చే వారికి 48 వేల డాలర్లు తక్కువ వేతనం ఇస్తున్నారని ఆయన గణాంకాలతో సహా విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల కోసం స్థానిక అమెరికన్లను ఉద్యోగాల నుంచి తీసేసి, విదేశీయులతో తక్కువ జీతాలకే పనిచేయిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపాధ్యక్షుడికి డెమొక్రాట్ ఎంపీ కౌంటర్
అమెరికా ప్రభుత్వ నిర్ణయంపై డెమొక్రాటిక్ ఎంపీ, కాంగ్రెస్ ఇమ్మిగ్రేషన్ సబ్‌కమిటీ టాప్ మెంబర్ ప్రమీలా జయపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో స్వయంగా హెచ్-1బీ వీసాపై అమెరికా వచ్చిన ఆమె.. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. చట్టబద్ధమైన వలస మార్గాలను దెబ్బతీయడం వల్ల అమెరికాలో సాంకేతిక ఆవిష్కరణల సామర్థ్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. PERM వ్యవస్థ అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేలా ఉందే తప్ప, స్థానిక ఉద్యోగాలకు నష్టం కలిగించేలా లేదని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. అయితే దీనికి జేడీ వ్యాన్స్ బదులిస్తూ.. "కార్పొరేట్ దిగ్గజాలకు చవకైన శ్రమను అందించేందుకు మద్దతు ఇవ్వడమే సోషలిజమా?" అని ఎద్దేవా చేశారు.
విద్యార్థులపై కూడా పడనున్న భారం
మరోవైపు విదేశీ విద్యార్థుల విషయంలోనూ అమెరికా కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఎఫ్-1 వీసాపై అమెరికా వచ్చి 'ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్' (OPT) ద్వారా ఉద్యోగ శిక్షణ పొందే విద్యార్థులపై కొత్త రుసుములు విధించాలని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ ప్రతిపాదించింది. ఒకవైపు హెచ్-1బీ వీసాలపై నిఘా పెంచడం, మరోవైపు గ్రీన్ కార్డ్ ప్రక్రియను నిలిపివేయడం, విద్యార్థులపై భారం మోపడం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో అమెరికా ఐటీ మార్కెట్లోకి విదేశీయులు అడుగుపెట్టడం మరింత కష్టతరం కానుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.













Click it and Unblock the Notifications
